
నన్ను అవమానించారు!
ముంబై: సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో సంచలనాలకు కొదువ లేదు. మాస్టర్ తాను చెప్పినట్లుగా ఇప్పటి వరకు బయటికి వెల్లడించని అనేక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాడు.
ముంబై: సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో సంచలనాలకు కొదువ లేదు. మాస్టర్ తాను చెప్పినట్లుగా ఇప్పటి వరకు బయటికి వెల్లడించని అనేక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాడు. నిజాలే చెప్పానన్న అతను నాటి ఘటనలపై తన ఆగ్రహావేశాలు దాచుకోలేదు. వేర్వేరు అంశాలపై సచిన్ రాసిన విశేషాలు అతని మాటల్లోనే...
కనీసం చెప్పలేదు: నన్ను కెప్టెన్సీనుంచి తొలగించిన విధానం చాలా బాధగా, అవమానకరంగా అనిపించింది. బీసీసీఐ నుంచి ఎవరూ నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. నేను కెప్టెన్‌ను కాదని మీడియా ద్వారానే తెలిసింది. అయితే అలా చేయడం నేను ఇంకా బాగా ఆడాలనే పట్టుదల నాలో పెంచింది. అయితే నా కోపం మాత్రం తగ్గలేదు. కెప్టెన్సీ బాధనుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది’
కోచ్‌గా కపిల్ విఫలం: నేను రెండో సారి కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో భారత దిగ్గజం కపిల్‌దేవ్ కోచ్‌గా ఉన్నారు. 1999-2000 ఆస్ట్రేలియాలాంటి కఠిన సిరీస్‌లో ఆయన నుంచి నేను చాలా ఆశించాను. జట్టు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించడంలో కోచ్‌దే కీలక పాత్ర అని నేను గట్టిగా నమ్ముతాను. అయితే ఆయన మాత్రం అన్నీ కెప్టెన్‌కే వదిలేశారు. మైదానంలో ఉపయోగపడగల వ్యూహ ప్రతివ్యూహాలు, చర్చల్లో ఆయన పెద్దగా పాల్గొనకపోయేవారు. ఒక కోచ్‌గా కపిల్ నన్ను తీవ్రంగా నిరాశపరిచారు.
నన్ను ఒంటరిగా వదిలెయ్: ముల్తాన్ టెస్టులో నేను 194 పరుగులతో ఆడుతున్నాను. మేం ముందుగా అనుకున్నదానికంటే ఒక ఓవర్ ముందే డిక్లరేషన్ జరిగింది. ఇలా చేయడంలో అర్థమే లేదు. నిరాశతో, బాధతో డ్రెస్సింగ్ రూమ్ చేరాను. ఆ సమయంలో చాలా ఆగ్రహంతో ఉన్నాను. జాన్ రైట్ వచ్చి తన తప్పేమీ లేదని క్షమాపణ చెప్పారు. కోచ్‌కే తెలియకపోతే సారీ చెప్పటం ఎందుకన్నాను.
గంగూలీ వచ్చి నాకూ తెలీదంటూ సారీ చెప్పినా అదే అన్నాను. చివరికి ఇక నటించలేనంటూ నా అసంతృప్తిని ద్రవిడ్ ముందు ప్రకటించేశాను. జట్టు గెలుపు కోసం నిర్ణయమంటూ అతను చెప్పిన వివరణతో నేను సంతృప్తి చెందలేదు. నేను కూడా జట్టు కోసం ఆడుతున్నానని, 194 పరుగులు జట్టుకే ఉపయోగపడతాయని చెప్పాను. ఈ కోపాన్ని నేను మైదానంలో చూపించను కానీ మైదానం బయట నన్ను ఒంటరిగా వదిలెయ్. కోలుకోవడానికి సమయం పడుతుంది అని ద్రవిడ్‌తో అన్నాను.