టీమిండియా 'లెక్క' సమం అవుతుందా?
ధర్మశాల:ఇప్పటికే న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపు మీద ఉన్న టీమిండియాకు మరో సవాల్ కు సిద్ధమవుతోంది. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్ ను ఆడనున్న నేపథ్యంలో ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్ లో కొంతవరకూ కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ధర్మశాలలో భారత జట్టుకు విజయాల రికార్డు అంతంతమాత్రంగా ఉండంటంతో దాన్ని అధిగమించేందుకు ధోని సేన కసరత్తు చేస్తుంది. ఇక్కడ భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు పరాజయాలను చవిచూడగా, ఒక విజయం మాత్రమే దక్కించుకుంది.
ఇప్పటివరకూ ధర్మశాలలో ఓవరాల్ గా 10 మ్యాచ్లు జరిగాయి. ఇక్కడ కేవలం రెండు వన్డేలు, ఎనిమిది టీ 20లను నిర్వహించారు. అయితే ఈ స్టేడియానికి 2013లో అంతర్జాతీయ హోదా వచ్చిన తరువాత ఇంగ్లండ్ తో జరిగిన వన్డేలో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ తరువాత 2014లో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో భారత్ విజయం సాధించింది. 2015లో ఇక్కడ చివరిసారి దక్షిణాఫ్రికాతో ఆడిన టీ 20లో భారత్ ఏడు వికెట్లతో ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో ధర్మశాల స్టేడియంలో న్యూజిలాండ్ జరిగే తొలి వన్డేలో గెలిచి ఇక్కడ రెండో గెలుపును సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఒక వేళ తొలి వన్డేలో భారత్ గెలిస్తే తమకు ఇక్కడ ఎదురైన ఓటమి లెక్కను సమం చేసే అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో ఆదివారం జరిగే తొలి వన్డేలో భారత్ ఎంతవరకూ రాణిస్తుందో వేచి చూడాల్సిందే.