ఆ సమయం వస్తే ధోనీయే తప్పుకుంటాడు
చెన్నై: భారత టి-20, వన్డే జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అపార అనుభవముందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. జట్టుకు ధోనీ అవసరం ఉన్నంత వరకూ కెప్టెన్గా కొనసాగాలని సూచించాడు. కెప్టెన్సీ నుంచి ధోనీని తప్పించి టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీకి అన్ని ఫార్మాట్లలో పగ్గాలు అప్పగించాలని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కపిల్ స్పందించాడు. జట్టును నడిపించే సామర్థ్యం ధోనీకి ఉందని, సమయం వచ్చినపుడు అతనే వీడ్కోలు చెబుతాడని అన్నాడు.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ధోనీ సమర్థవంతంగా పనిచేస్తున్నాడని, మరి కొంతకాల సారథిగా కొనసాగాలని కపిల్ అభిప్రాయపడ్డాడు. ధోనీతో విరాట్‌ను ఇప్పుడే పోల్చడం సరికాదని అన్నాడు. ఇద్దరి వ్యక్తిగత శైలి భిన్నంగా ఉంటుందని చెప్పాడు. ధోనీ ప్రశాంతంగా ఉంటాడని, కోహ్లీ దూకుడు స్వభావం గల వాడని కపిల్ విశ్లేషించాడు. ధోనీ, కోహ్లీ వేర్వేరు ఫార్మాట్ల జట్లకు సారథ్యం వహిస్తున్నారని, వారిది విభిన్న దృక్పథమని, ఇద్దరిని పోల్చడం కష్టమని కపిల్ అన్నాడు. ప్రతి ఒక్కరికీ సొంత శైలి ఉంటుందని చెప్పాడు. భారత సీమర్లు బౌలింగ్‌లో మెరుగుపడుతున్నారని కపిల్ ప్రశంసించాడు. భారత బౌలర్లు 140 ప్లస్ వేగంతో, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నారని అన్నాడు.