ఫైనల్లో దీపికా పళ్లికల్ ఓటమి
మెల్ బోర్న్: భారత స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్కు నిరాశే ఎదురైంది. మెల్బోర్నోలో ఆదివారం జరిగిన విక్టోరియా ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ ఫైనల్లో దీపిక ఓటమి పాలైంది. రెండో సీడ్, ఇంగ్లండ్ క్రీడాకారిణి మిల్లీ టామిల్సన్ చేతిలో 11-6, 4-11, 11-3, 7-11, 9-11 తేడాతో ఓడి రన్నరప్ గా నిలిచింది.
తొలి సెట్ కైవసం చేసుకున్న దీపిక రెండో సెట్ కోల్పోయిన త్వరగానే కోలుకుని మూడో సెట్ సొంతం చేసుకుని విజయం దిశగా నడిచింది. కానీ, ఇంగ్లండ్ ప్లేయర్ మిల్లీ అనూహ్యంగా పుంజుకుని రెండు వరుస సెట్లు కైవసం చేసుకోవడంతో దీపిక పోరాటం ముగిసింది. నాలుగు, ఐదు సెట్లలో పోరు హోరాహోరీగా జరిగింది. అయితే చివరికి ప్రత్యర్థినే విజయం వరించడంతో దీపిక రన్నరప్ గా నిలిచింది.