
కోహ్లీతో పోలిక.. పాక్ ప్లేయర్ మండిపాటు!
న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో ఉంది. దీంతో పాటు ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్ లపై పాక్ క్రికెట్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సరిపోల్చడం ఉమర్ అక్మల్ జీర్ణించుకోలేక పోతున్నాడు. ఈ ముగ్గురు క్రికెటర్ల కెరీర్ దాదాపు ఒకే సమయంలో జరిగింది. జట్లు వేరయినా పోలిక మాత్రం పాక్ ఆటగాళ్లకు మింగుడు పడటం లేదు.
'కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. దయచేసి నన్ను కోహ్లీతో పోల్చవద్దు. ఎందుకంటే నేను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వస్తాను. ఒకవేళ పాక్ క్రికెట్ ఫ్యాన్స్, క్రీడా విశ్లేషకులు తనను కోహ్లీతో పోల్చాలనుకుంటే.. రెండు కండిషన్లు పాటిస్తే బాగుంటుంది. ఒకటి.. నా తరహాలో కోహ్లీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం. రెండోది.. కోహ్లీ లాగానే తనకు వన్ డౌన్ లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇప్పించడం. ఇంకా చెప్పాలంటే మా జట్టు వన్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్ తో కోహ్లీని పోల్చడం సరైన ఆలోచన' అని కీపర్ ఉమర్ అక్మల్ వివరించాడు.
116 వన్డేలాడిన అక్మల్ రెండు సెంచరీలు సాధిస్తే.. 179 వన్డేలాడిన విరాట్ 27 సెంచరీలతో దూసుకుపోతున్నాడు. వీటికి తోడు పాక్ వరుస సిరీస్ ఓటములతో ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్ లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమర్ తన అసహనాన్ని వెల్లగక్కాడు.