Babar Azam Breaks Kohli, Rohit Records: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో అతను టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రికార్డులను బద్ధలు కొట్టాడు.
రోహిత్‌ను వెనక్కునెట్టి రెండో స్థానానికి..
బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 13) జరిగిన హోరాహోరీ సమరంలో హాఫ్ సెంచరీ బాదిన బాబర్ (40 బంతుల్లో 55; 9 ఫోర్లు).. టీ20ల్లో 29వ హాఫ్ సెంచరీ నమోదు చేసి, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మను (28 హాఫ్ సెంచరీలు) వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ 33 హాఫ్ సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు.
అత్యంత వేగంగా 11 వేల పరుగుల మార్కును అందుకున్న బ్యాటర్‌గా..
ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లు) 11000 పరుగుల మైలురాయిని చేరుకున్న బాబర్.. టీమిండియా మాజీ కెప్టెన్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కోహ్లి 261 ఇన్నింగ్స్‌ల్లో 11000 పరుగుల మార్కును చేరుకుని, అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న ఆసియా బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కగా, తాజాగా బాబర్ 251 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్కును అందుకుని.. కోహ్లి రికార్డును బద్ధలు కొట్టాడు.
బాబర్ 42 టెస్టుల్లో(75 ఇన్నింగ్స్) 3122 పరుగులు, 92 (90 ఇన్నింగ్స్) వన్డేల్లో 4664 పరుగులు, 91 (86 ఇన్నింగ్స్) టీ20ల్లో 3216 పరుగులు చేసి 11000 మార్కును చేరుకున్నాడు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీకి సిద్ధమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment