ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పూసర్ల వెంకట సింధు సీజన్‌ను గొప్పగా ముగించే దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రతిష్టాత్మక వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఈ తెలుగు తేజం సెమీఫైనల్‌కు చేరుకొని తన తొలి లక్ష్యాన్ని అధిగమించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ వరుసగా రెండో పరాజయంతో అనూహ్యంగా లీగ్ దశలోనే నిష్క్రమించాడు. ఈ ఏడాది అందరికంటే ఎక్కువగా నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్ ఈ మెగా టోర్నీలో మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు.
దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: తొలి లీగ్ మ్యాచ్‌లో గట్టెక్కేందుకు కాస్త శ్రమించిన భారత స్టార్ పీవీ సింధు రెండో లీగ్ మ్యాచ్‌లో మాత్రం జూలు విదిల్చింది. కేవలం 36 నిమిషాల్లో తన ప్రత్యర్థి ఆట కట్టించింది. మహిళల సింగిల్స్ విభాగంలోని గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–13, 21–12తో సయాకా సాటో (జపాన్)ను చిత్తుగా ఓడించింది. ఇదే గ్రూప్‌లో ఉన్న అకానె యామగుచి కూడా రెండు విజయాలు సాధించడంతో సింధుతో కలిసి ఆమె కూడా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శుక్రవారం వీరిద్దరి మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన వారు గ్రూప్ టాపర్‌గా నిలుస్తారు. ఈ ఏడాది సయాకా సాటోను రెండుసార్లు ఓడించిన సింధు మూడోసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరంభంలో 1–3తో వెనుకబడిన సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 7–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ తెలుగు అమ్మాయి తన జోరును మరింతగా పెంచింది. సాటోకు ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సింధు ఆటకు ఎదురులేకపోయింది. స్కోరు 11–7 వద్ద సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 19–7తో ముందంజ వేసింది. ఆ తర్వాత సాటోకు ఐదు పాయింట్లు కోల్పోయినా... ఏకాగ్రత కోల్పోకుండా ఆడి తన విజయానికి అవసరమైన రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను ముగించింది.
శ్రీకాంత్‌కు షాక్...
పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో భారత స్టార్ శ్రీకాంత్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 18–21, 18–21తో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ప్రపంచ చాంపియన్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీకాంత్ ఓడిన సంగతి తెలిసిందే. టియెన్‌తో 43 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ నిలకడలేని ఆటతీరుతో మూల్యం చెల్లించుకున్నాడు. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన టియెన్ పదునైన స్మాష్‌లతో శ్రీకాంత్‌కు కళ్లెం వేశాడు. శుక్రవారం జరిగే నామమాత్రమైన మూడో లీగ్ మ్యాచ్‌లో షి యుకి (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు. గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో షి యుకి 13–21, 21–18, 21–17తో అక్సెల్‌సన్‌ను ఓడించి రెండో విజయంతో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. టియెన్, అక్సెల్‌సన్‌ల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచిన వారు షి యుకితో కలిసి మరో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment