
సౌతాంప్టన్ : ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఏది కలసిరావడంలేదు. ఆతిథ్య ఇంగ్లండ్, పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు పరాజయాలతోనే సతమతమవతున్న సఫారీ జట్టుకు ఆటగాళ్ల గాయాలు మరో తలనొప్పిగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎన్‌గిడి గాయపడ్డాడు. దీంతో అతడికి పదిరోజుల విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఇక ఆ జట్టు స్టార్ బౌలర్ డెల్ స్టెయిన్‌కు పాత గాయం తిరగబెట్టడంతో ఏకంగా టోర్నీకే దూరమయ్యాడు. దీంతో స్టెయిన్ ప్రపంచకప్‌కు దూరం కావడానికి ఐపీఎల్ కారణమంటూ సఫారీ జట్టు సారథి డుప్లెసిస్ నిందిస్తున్నాడు.
‘ఐపీఎల్‌లో స్టెయిన్ ఆడకుంటే ప్రస్తుతం ప్రపంచకప్‌లో అతడి సేవలను దక్షిణాఫ్రికా వినియోగించుకునేది. ఐపీఎల్‌కు ముందు అతడు గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్‌లో ఆడాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత మళ్లీ గాయపడటంతో టోర్నీకి దూరమయ్యాడు. ఆ సమయంలో ఆడకుండా విశ్రాంతి తీసుకోకపోవడమే స్టెయిన్ చేసిన పొరపాటు’అంటూ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున ప్రాతినిథ్యం వహించిన స్టెయిన్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.