న్యూఢిల్లీ: బౌలర్లు స్వింగ్ రాబట్టేందుకు బంతి నాణ్యంగా ఉంటే సరిపోతుందని, ఉమ్మి (సలైవా) వాడాల్సిన అవసరమే లేదని డ్యూక్స్ క్రికెట్ బంతుల తయారీదారు, బ్రిటీష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ యజమాని దిలీప్ జజోడియా అన్నారు. బంతి మెరుపు కోసం సలైవాను వాడకుంటే బౌలర్లు తేలిపోతారనే వాదనల్లో నిజం లేదని చెప్పారు. ‘తొందరగా ఆకారం కోల్పోయే కూకా బుర్రా, ఎస్‌జీ బంతులు వాడే ఆస్ట్రేలియా, భారత్ లాంటి దేశాలే సలైవాకు ప్రత్యామ్నాయం కోరుతున్నాయి. స్వింగ్ రాబట్టాలంటే బంతికి మెరుపు మాత్రమే సరిపోదు. అది సరైన ఆకారంలో, తగిన సీమ్‌తో, గట్టిగా ఉండటంతో పాటు... బౌలర్‌కు నైపుణ్యం కూడా ఉండాలి. ఇలాంటి లక్షణాలు లేని బంతుల్ని వాడినప్పుడు మాత్రమే స్వింగ్ కోసం లాలాజలం, కృత్రిమ పదార్థాలపై ఆధారపడాల్సి ఉంటుంది’ అని దిలీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అత్యంత నాణ్యంగా ఉండే డ్యూక్స్ బంతులతో ఉమ్మి వాడకుండానే స్వింగ్ రాబట్టొచ్చని ఆయన తెలిపాడు. ‘మా బంతులకు వాటర్ ప్రూఫ్ లక్షణం కల్పించేందుకు వీలుగా తయారీలో లెదర్‌కు గ్రీజ్‌ను వాడతాం. దీంతో బౌలర్ బంతిని ప్యాంట్‌కు రుద్దినప్పుడు ఏర్పడే ఘర్షణ కారణంగా బంతికి మెరుపు వస్తుంది. ఉమ్మిని వాడటం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది తప్ప ఉమ్మి లేకుంటే బంతికి మెరుపు రాదనడం అబద్ధం’ అని ఆయన వివరించారు. ఐసీసీ పేర్కొన్నట్లు స్వింగ్ కోసం బౌలర్లు చెమట ఉపయోగిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విండీస్‌తో సిరీస్ కోసం ఇంగ్లండ్ బౌలర్లు ప్రస్తుతం డ్యూక్స్ బంతులతోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment