ద్యుతీ 'పరుగు' ముగిసింది!
రియో డీ జనీరో:దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించిన స్ప్రింటర్ ద్యుతీచంద్.. రియో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ రేసుకు క్వాలిఫై కావడంలో విఫలమైంది. తొలి రౌండ్ లో భాగంగా భారతకాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల రేసులో ద్యుతీ చంద్ ఏడో స్థానంలో నిలిచి రియో నుంచి నిష్క్రమించింది. హీట్ -5లో జరిగిన ఈ రేసును ద్యుతీచంద్ 11.69 సెకెండ్లలో ముగించి సెమీస్కు అర్హత సాధించడంలో విఫలమైంది.
ఒక్కో హీట్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే సెమీస్ కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో భారత పెట్టుకున్న ఆశలకు ఆదిలోనే బ్రేక్ పడింది. అంతకుముందు పురుషుల 400 మీటర్ల ఈవెంట్లో భారత స్ప్రింటర్ మొహ్మద్ అనాస్ కూడా నిరాశపరిచాడు. ఈ రేసును 45. 95 సెకెండ్లలో పూర్తి చేసి ఆరోస్థానంలో నిలవడం ద్వారా సెమీస్కు అర్హత సాధించడంలో విఫలం చెందాడు. మరోవైపు లాంగ్ జంప్లో అంకిత్ శర్మ సైతం నిరాశపరిచాడు. ఈ ఈవెంట్లో 24వ స్థానంలో నిలిచిన అంకిత్ తదుపరి రౌండ్కు అర్హత సాధించలేకపోయాడు.