ద్యుతీ...మన చిరుత
► 100 మీటర్లలో ద్యుతీ చంద్‌కు రియో బెర్త్
► 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ విభాగంలో
► బరిలోకి భారత క్రీడాకారిణి
► పీటీ ఉష తర్వాత మొదటి క్రీడాకారిణి
ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. దీని వెనుక చాలా మంది ఆశీర్వాదాలు ఉన్నాయి. గతేడాది చాలా కష్టాలు పడ్డా. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా. నా శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు లభించింది. కోచ్ రమేశ్ అండ లేకపోతే ఇది సాధ్యమయ్యేదికాదు. నాకు మద్దతుగా నిలిచిన సాయ్, క్రీడాశాఖ, అథ్లెటిక్స్ సమాఖ్యలకు కృతజ్ఞతలు. దేశానికి పతకం తెచ్చేందుకు మరింత శ్రమిస్తా. - ద్యుతీ
న్యూఢిల్లీ: కష్టాల కడలిని... కన్నీళ్ల సంద్రాన్ని కనురెప్ప దాటనీయకుండా పోరాటం చేసిన భారత అథ్లెట్ ద్యుతీ చంద్... మన అథ్లెటిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. సౌకర్యాలు కరువైనా... ఆర్థికంగా అండలేకపోయినా... పట్టుదలనే పెట్టుబడిగా పెట్టి ట్రాక్‌పై సంచలనాలు సృష్టించేలా పరుగెత్తిన ఈ ఒడిషా అమ్మాయి ప్రతిష్టాత్మక ‘రియో ఒలింపిక్స్’కు అర్హత సాధించింది. కజకిస్తాన్‌లో శనివారం జరిగిన ‘కొసనోవ్ మెమోరియల్’ మీట్‌లో భాగంగా జరిగిన మహిళల 100 మీటర్ల హీట్స్‌ను ద్యుతీ 11.30 సెకన్లలో ముగించింది. ఒలింపిక్ కటాఫ్ టైమ్ (11.32 సెకన్లు) కంటే 0.2 సెకన్లు ముందుగా లక్ష్యాన్ని చేరడంతో రియో టికెట్ ఖాయమైంది. ఫలితంగా దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత 100 మీటర్ల పరుగులో భారత క్రీడాకారిణి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అంచనాలకు మించి రాణించిన ద్యుతీ ఫెడరేషన్ కప్‌లో తాను నెలకొల్పిన జాతీయ రికార్డు (11.33 సెకన్లు)ను కూడా ఈ సందర్భంగా బద్దలు కొట్టింది.
కష్టాలకు ఎదురీదుతూ...
ఒడిశాలో గోపాల్‌పూర్ అనే ఓ చిన్న గ్రామం. అందులో ఓ నిరుపేద చేనేత కుటుంబం.. ఆరుగురు అక్కాచెల్లెళ్లు... ఓ సోదరుడు.. పుట్టినప్పట్నించీ అన్ని కష్టాలే... రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. కనీస వసతులకు కూడా నోచుకోలేని ఆ కుటుంబం నుంచి ద్యుతీ అంచలంచెలుగా ఎదిగింది. అడుగడుగునా వెక్కిరించే కష్టాలను ఓర్పుగా జయిస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో చిరుతలా మారింది. పరుగెత్తడానికి మైదానం కూడా లేని పరిస్థితుల్లో కొండలు, కోనలు, సెలయేళ్లు అంటూ ప్రకృతిని ఆసరాగా చేసుకొని నదుల వెంట పరుగు తీసింది. అయితే సాధన ఉన్నా... సరైన శిక్షణ లేకపోవడంతో ఆరంభంలో కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కానీ కోచ్ రమేశ్ అండతో వీటన్నింటిని జయించి ప్రతి రోజూ తనకు తానుగా ఓ కొత్త అథ్లెట్‌గా రూపాంతరం చెందింది.
జాతీయ స్థాయి టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ద్యుతీ... 2013 పుణేలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత అండర్-18 వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌తో పాటు తైపీలో జరిగిన పోటీల్లో 200 మీటర్లలో చాంపియన్‌గా నిలిచి అంతర్జాతీయ స్టార్‌గా మారింది. ఇక స్ప్రింట్‌లో తిరుగులేని క్రీడాకారిణిగా మారుతున్న తరుణంలో 2014లో ద్యుతీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తనలో ‘టెస్టోస్టిరాన్’ (పురుష హార్మోన్) స్థాయి అధికంగా ఉందని, మహిళా అథ్లెట్‌గా పరిగణించలేమని ఐఏఏఎఫ్ నిషేధం విధించింది. దీంతో ‘కామన్వెల్త్ గేమ్స్’లో పతకం సాధించాలన్న ఆమె ఆశలకు గండిపడింది.
ఈ పరిణామంతో నిరాశకు లోనైన ద్యుతీ ఓ ఏడాది పాటు శిక్షణకు, పోటీలకు దూరమైంది. అయితే సన్నిహితులు ఇచ్చిన స్ఫూర్తితో తనపై విధించిన నిషేధాన్ని... స్విట్జర్లాండ్‌లోని ‘కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)’లో అప్పీల్ చేసింది. సుదీర్ఘ విచారణ, రిపోర్టుల పరిశీలన, వాదనలు విన్న తర్వాత గతేడాది జూలైలో పాక్షికంగా నిషేధాన్ని ఎత్తివేస్తూ కాస్ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన ద్యుతీ కఠిన శిక్షణ, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ట్రాక్‌పై సంచలనం సృష్టించింది. ఫలితంగా రియో బెర్త్ ఆమె ముంగిటకు చేరింది. - సాక్షి క్రీడావిభాగం
భారత్ నుంచి ఐదో క్రీడాకారిణి
ఓవరాల్‌గా భారత్ నుంచి 100 మీటర్ల రేసులో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ఐదో క్రీడాకారిణిగా ద్యుతీ రికార్డులకెక్కింది. 1952 హెల్సింకీ పోటీల్లో నీలిమా ఘోష్, మేరీ డిసౌజాలు భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా... ఈ ఇద్దరూ హీట్స్ (1, 9)లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మెల్‌బోర్న్ (1956) ఒలింపిక్స్‌లో మేరీ లీలా రావు మళ్లీ దేశం తరఫున బరిలోకి దిగింది. కానీ రేసును పూర్తి చేయలేకపోయింది. ఎలాంటి అర్హత పోటీ లేకుండా మాస్కో (1980) ఒలింపిక్స్‌లో పాల్గొన్న పీటీ ఉష... హీట్స్‌తోనే సంతృప్తిపడింది. బరిలోకి దిగిన తొలి హీట్స్‌లో ఆమె ఆరో స్థానంతో సంతృప్తిపడింది. ఇక అప్పటి నుంచి 100 మీటర్లలో ఇంకెవ్వరూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. అయితే ఏథెన్స్ (2004) ఒలింపిక్స్‌లో సరస్వతి దేవ్ సాహా 200 మీటర్ల రేసులో పాల్గొంది.
అండగా తెలుగు వ్యక్తులు
కష్టాలను జయిస్తూ.. కెరీర్‌ను కొనసాగించిన ద్యుతీకి అడుగడుగునా తెలుగు వ్యక్తులు ముగ్గురు అండగా నిలిచారు. ఆరంభంలో అన్నీ తానై నిలబడ్డ కోచ్ నాగ్‌పూరి రమేశ్... ద్యుతీని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎన్నో త్యాగాలు చేశారు. ఉన్న వసతుల్లోనే అత్యుత్తమ శిక్షణను రమేశ్ ఇస్తే... అందుకు తగ్గ ఫలితాలను ద్యుతీ చూపెట్టింది. ఇక ప్రతి రోజూ శిక్షణ కోసం గోపీ చంద్ తన అకాడమీలో సౌకర్యాలు ఇచ్చారు. ద్యుతీ అక్కడే దాదాపు ఆరు గంటల పాటు శ్రమిస్తుంది. అయితే వసతుల పరంగా ఇబ్బందిలేకున్నా.. టోర్నీలకు, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం తప్పనిసరి కావడంతో ద్యుతీని మళ్లీ కష్టాలు వెంటాడాయి. సాయ్ నుంచి కొద్దోగొప్పో సాయం అందినా అది ఏమూలకు సరిపోకపోయేది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ అండగా నిలిచారు. ద్యుతీకి లక్ష రూపాయలు ఆర్థికసాయం చేసి... ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తే మరో ఐదు లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే ఇప్పుడు ద్యుతీకి ఆ డబ్బు ఇస్తున్నట్లు చెప్పారు. ద్యుతీయే కాకుండా తెలంగాణ క్రీడాకారులు ఎవ రు ఒలింపిక్స్‌లో ఏ పతకం సాధించినా వారికి బీఎండబ్ల్యూ కారు ఇస్తానని చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు.