
లండన్: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసి రెండో టెస్టు నాటికి పూర్తి స్థాయి జట్టతో బరిలోకి దిగాలని భావిస్తున్న ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. యాషెస్ తొలి టెస్టు మొదటి రోజు ఆటలోనే కాలిపిక్క గాయంతో ఫీల్డ్‌ను అర్థాంతరంగా విడిచివెళ్లిపోయిన ఇంగ్లండ్ ప్రధాన పేస్ ఆయుధం జేమ్స్ అండర్సన్ ఇంకా తేరుకోలేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనే అండర్సన్ బౌలింగ్‌కు దిగుతాడని భావించినా అది జరగలేదు. కాగా, ఆగస్టు 14వ తేదీ నుంచి లార్డ్స్ వేదికగా జరుగనున్న రెండో టెస్టుకు సైతం అండర్సన్ దూరం కానున్నాడు. అండర్సన్ గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టే సమయం ఉన్నందున అండర్సన్ రెండో టెస్టు నాటికి అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) స్పష్టం చేసింది.
ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ తర్వాత అండర్సన్ జట్టు పునరావస శిబిరంలో చికిత్స తీసుకుంటున్నాడు. రెండో టెస్టులో అండర్సన్ స్థానంలో యువ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్ మొత్తం యాషెస్ సిరీస్‌కే దూరమయ్యాడు. పక్కటెముకల నొప్పితో సతమతమవుతున్న మార్క్‌వుడ్ యాషెస్ నుంచి తప్పుకున్నాడు. తొలి టెస్టులో ఆసీస్ 251 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ పూర్తిగా తేలిపోయిన ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన అండర్సన్ లేకపోవడం ఆ జట్టు బౌలింగ్ విభాగంపై తీవ్ర ప్రభావం చూపింది.