ఇంగ్లండ్కు డీఆర్ఎస్ భయం!
రాజ్కోట్: భారత్ తో జరిగే సుదీర్ఘ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లో తాము పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్నామని ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. రేపట్నుంచి తొలి టెస్టు ఆరంభమవుతున్న నేపథ్యంలో తమ జట్టు అండర్ డాగ్స్గా పోరుకు సిద్ధమవుతుందన్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకులో ఉన్న భారత్.. ఇటీవల కాలంలో అద్భుతమైన క్రికెట్ ఆడుతుందని కొనియాడాడు. ఈ సిరీస్లో తమకు అది పెద్ద ఛాలెంజ్ ఎదురుకాబోతుందని అండర్సన్ పేర్కొన్నాడు. తమ ప్రణాళికలు ఇక్కడ అంతగా పని చేయకపోవచ్చని బ్రాడ్ స్పష్టం చేశాడు.
మరోవైపు భారత్ క్రికెట్ జట్టు డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయ పద్ధతి)అమలుకు సిద్ధమైన నేపథ్యంలో ఈ అంశంపై తాము అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. తాము గతంలో డీఆర్ఎస్తో చాలా మ్యాచ్లు ఆడినప్పటికీ.. ఇక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయన్నాడు. డీఆర్ఎస్పై ముందుకు వెళ్లే క్రమంలో జట్టు కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమన్నాడు. ప్రధానంగా వికెట్ కీపర్, బౌలర్కు ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతిపై ముందడుగు వేయాలన్నాడు.
'ఇంగ్లండ్లో డీఆర్ఎస్ అనేది చాలా పాపులర్. ఇటీవల బంగ్లాదేశ్ తో కూడా డీఆర్ఎస్ తో మ్యాచ్ లు ఆడాం. అయితే ఇంగ్లండ్, బంగ్లాదేశ్లోని పరిస్థితుల కంటే భారత్ లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ డీఆర్ఎస్ కు వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండాలి. భారత్ లో పిచ్ లు చాలా భిన్నంగా ఉండే క్రమంలో కొన్ని ఫలితాలు మనం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. దాంతో డేంజర్ జోన్లో పడే అవకాశం ఉంది. ఒకసారి ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే ముందు అటు కెప్టెన్, వికెట్ కీపర్తో పాటు కెప్టెన్ తో సమీక్షించి ముందడుగు వేయాల్సి ఉంది'అని బ్రాడ్ తెలిపాడు.