లండన్ : ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాకింగ్స్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు రెండు, నాలుగు స్థానాలు పొందడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తప్పుబట్టాడు. 'నేను నిజాయితీగా ఐసీసీ ర్యాంకులను తప్పుబడుతున్నా. నా దృష్టిలో అవొక చెత్త ర్యాంకింగ్స్ అనుకుంటున్నా' అంటూ వాన్ విమర్శించాడు.
'ప్రసుత్తం రెండో స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ గత రెండేళ్లలో ఎన్ని సిరీస్‌లు గెలిచిందో నాకు ఐడియా లేదు. కానీ ఈ ఏడాది వారి ప్రదర్శన చూసుకుంటే మాత్రం 2వస్థానం వారికి కరెక్టు కాదని నా అభిప్రాయం. ఇక 4 స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ప్రదర్శన ఏడాదిగా కాస్త మెరుగుపడింది. గత మూడు, నాలుగేళ్లుగా ఇంగ్లండ్ జట్టు టెస్టు క్రికెట్‌లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించింది. విదేశాల్లో మా జట్టు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఈ ఏడాది ప్రదర్శన చేసుకుంటే అందులో స్వదేశంలో ఐర్లాండ్ జట్టుపై మాత్రమే సిరీస్ గెలుచుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్‌ను డ్రాతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకులు కాస్త గందరగోళంగా ఉన్నాయంటూ' వాన్ చెప్పుకొచ్చాడు.
అయితే వాన్ ఆస్ట్రేలియాను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రసుత్తం 5వ స్థానంలో కొనసాగుతున్న ఆసీస్ ఆ స్థానంలో ఉండడం కరెక్టు కాదని వాన్ అభిప్రాయపడ్డాడు. 'నా దృష్టిలో ప్రసుత్త టెస్టు క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియాలు మాత్రమే ఉత్తమ జట్లని, సరిగ్గా 12 నెలల క్రితం ఆసీస్‌ను వారి సొంత గడ్డపై ఓడించిన ఘనత టీమిండియా సొంతం చేసుకుందని' వాన్ పేర్కొన్నాడు. అయితే అప్పటి సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లైన వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్‌ను జట్టులో లేకపోవడంతో ఆసీస్ టీమిండియాకు సిరీస్ అప్పగించిందని గుర్తుచేశాడు.
వచ్చే ఏడాది చివరిలో భారత్ ఆసీస్‌లో అడుగుపెట్టేసరికి ఆసీస్ జట్టు అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంటుందనే తాను కోరుకుంటున్నట్లు వాన్ పేర్కొన్నాడు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన బౌలింగ్, బ్యాటింగ్ వనరులు కలిగిన టీమిండియాను ప్రతిఘటించగల శక్తి ఒక్క ఆసీస్‌కు మాత్రమే ఉందంటూ వాన్ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. (చదవండి : బుమ్రాకు ఫిట్‌నెస్ టెస్ట్ అవసరం లేదు)
Comments
Please login to add a commentAdd a comment