ఇంగ్లండ్ దే తొలి వన్డే
♦ 39 పరుగుల తేడాతో ఓడిన దక్షిణాఫ్రికా
♦ డికాక్ సెంచరీ వృథా
బ్లోమ్‌ఫోంటీన్: ఓపెనర్ క్వింటాన్ డి కాక్ (96 బంతుల్లో 138 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ శతకం సాధించినా దక్షిణాఫ్రికా జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ‘డక్‌వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 400 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా వర్షంవల్ల ఆట నిలిచిపోయే సమయానికి 33.3 ఓవర్లలో 5 వికెట్లకు 250 పరుగులు మాత్రమే చేసింది. ఆమ్లా (6) విఫలమైనా... డికాక్, డు ప్లెసిస్ (55)లు రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించారు.
డివిలియర్స్ (8), డుమిని (13), రో సోవ్ (19)లు విఫలమయ్యారు. 34వ ఓవర్‌లో భారీ వర్షం కురవడంతో ఆగిపోయిన మ్యాచ్ మళ్లీ మొదలవ్వలేదు. దీంతో డక్‌వర్త్ ప్రకారం సఫారీ జట్టు విజయలక్ష్యాన్ని 290 పరుగులుగా నిర్దేశించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 399 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభిం చింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే పోర్ట్ ఎలిజబెత్‌లో శనివారం జరుగుతుంది.