ఇంగ్లండ్ చరిత్ర సృష్టించేనా?
లండన్: అద్వితీయ విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లండ్ జట్టు యాషెస్‌లో కొత్త చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతుండగా... కనీసం ఒక్క టెస్టులోనైనా గెలిచి కొంత పరువైనా కాపాడుకోవాలని ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నేటి నుంచి (బుధవారం) ఓవల్‌లో యాషెస్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు జరగనుంది. ఇప్పటికే 3-0తో సిరీస్ నిలబెట్టుకున్న ఇంగ్లండ్.. 1950 తర్వాత మ్యాచ్ ఓడిపోకుండా మూడు టెస్టుల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి. అయితే సొంతగడ్డపై ఇప్పటి వరకు ఇంగ్లండ్ 4-0తో సిరీస్ గెలవలేదు.
ఇప్పుడు కుక్‌సేన ఈ రికార్డును అందుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మొత్తానికి ఫైనల్ టెస్టు ఫలితం ఇరుజట్లపై పెద్ద ప్రభావమే చూపనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాటింగ్‌లో కెప్టెన్ కుక్‌తో పాటు టాప్ ఆర్డర్ మొత్తం ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. లోయర్ ఆర్డర్‌లో బ్రాడ్ తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. బౌలింగ్ విషయానికొస్తే గాయంతో దూరమైన బ్రెస్నన్ స్థానంలో పేసర్ క్రిస్ ట్రెమ్లెట్, ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, స్పిన్నర్ సిమన్ కెరిగాన్‌లలో ఒకరిని తీసుకోవచ్చు. ట్రెమ్లెట్‌కు సొంత గ్రౌండ్ కావడం కాస్త అనుకూలించొచ్చు. ఆసీస్‌ను వణికిస్తున్న స్వాన్ ఈ మ్యాచ్‌లోనూ తన ప్రభావం చూపాలని భావిస్తున్నాడు.
మరోవైపు ఆసీస్ జట్టులోనూ భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఘోరంగా విఫలమవుతున్న ఉస్మాన్ ఖాజాతో పాటు జాక్సన్ బర్డ్‌పై వేటు పడింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన పేసర్ ఫాల్క్‌నర్ ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు. ఏదేమైనా సమష్టిగా రాణించడంపై ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు విజయం ఆధారపడి ఉంటుంది.