Slow Over Rate England And Australia Teams Docked Crucial WTC Points - Sakshi
Sakshi News home page

స్లో ఓవర్‌ రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌, ఆసీస్‌లకు షాక్‌; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత

Published Wed, Aug 2 2023 4:42 PM

Slow Over Rate-England-Australia-Teams-Docked-Crucial WTC Points - Sakshi

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్‌ సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులు ఆసీస్‌ నెగ్గితే.. మూడు, ఐదో టెస్టు ఇంగ్లండ్‌ నెగ్గింది. ఇక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఐదోటెస్టు గెలిచిన ఇంగ్లండ్‌ డబ్ల్యూటీసీ పట్టికలో పాయింట్ల పరంగా ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచింది.

ఇరుజట్లు ఐదు టెస్టుల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో నిలిచాయి. ఈ లెక్కన ఇరుజట్లు 26 పాయింట్లు(43.33 పర్సంటేజీ పాయింట్స్‌)తో పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్‌కు ఈ మురిపెం ఒక్కరోజుకే పరిమితమైంది. తాజాగా బుధవారం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలకు ఐసీసీ షాక్‌ ఇచ్చింది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఐదుటెస్టుల్లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదైన కారణంగా ఇంగ్లండ్‌, ఆసీస్‌ ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులో జరిమానా విధించడంతో పాటు ఇరుజట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లలోనూ భారీ కోత పడింది.

ఆస్ట్రేలియా ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసింది. టెస్టుల్లో ఒకరోజుకు ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లు వేయాల్సి ఉంటుంది(ఇరుజట్లు లేదా ఒకే జట్టు). అయితే ఆసీస్‌ నాలుగో టెస్టులో నిర్ణీత సమయంలోగా 10 ఓవర్లు తక్కువగా వేసినందుకు గానూ ఒక్క షార్ట్‌ ఓవర్‌ కింద ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో ఓవర్‌కు 5శాతం చొప్పున జరిమానాతో పాటు ఒక డబ్ల్యూటీసీ పాయింట్‌ కోత విధిస్తారు. ఈ లెక్కన ఆసీస్‌ 10 ఓవర్లు చొప్పున 10 డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోయింది. ఇక మ్యాచ్‌లో ఆటగాళ్లకు 50శాతం జరిమానా విధించారు.

ఇక ఇంగ్లండ్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. యాషెస్‌లో జరిగిన ఐదు టెస్టుల్లో ఏకంగా నాలుగు టెస్టుల్లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిన ఇంగ్లండ్‌కు గట్టి దెబ్బపడింది. తొలి టెస్టుల్లో రెండు ఓవర్లు, రెండో టెస్టులో తొమ్మిది ఓవర్లు, నాలుగో టెస్టులో మూడు ఓవర్లు, ఇక చివరి టెస్టులో ఐదు ఓవర్లు.. మొత్తంగా 19 ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ఒక ఓవర్‌ చొప్పున ఇంగ్లండ్‌కు 19 ఓవర్లకు 19 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడ్డాయి. దీంతో ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులోనూ జరిమానా పడింది. తొలి టెస్టులో 10 శాతం, రెండో టెస్టులో 45 శాతం, నాలుగో టెస్టులో 15శాతం, చివరి టెస్టులో 25శాతం జరిమానా విధించారు.

దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే డబ్ల్యూటీసీ పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకోవడం విశేషం. 19 పాయింట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ ప్రస్తుతం 13 పాయింట్లు(15 పర్సంటేజీ పాయింట్స్‌)తో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక 10 పాయింట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 30 పర్సంటేజీ పాయింట్స్‌తో మూడో స్థానంలో ఉన్నప్పటికి భారీగా పాయింట్లు కోల్పోవడం ఆ జట్టుకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక టీమిండియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఓటమి పాలైన విండీస్‌ 16.67 పర్సంటేజీ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. 

చదవండి: R Ashwin: 'టీమిండియా బజ్‌బాల్‌ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి'

Advertisement
 
Advertisement
 
Advertisement