సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్‌కు ఈ బాధ మర్చిపోకముందే మరో ఎదురదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత జట్టుకు 10 శాతం జరిమానా (మ్యాచ్ ఫీజ్‌లో) విధించబడింది. అలాగే రెండు ముఖ్యమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను సైతం టీమిండియా కోల్పోయింది.
కనీస ఓవర్ రేట్‌ను మెయింటైన్ చేయడంలో విఫలం కావడంతో టీమిండియాపై ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ చర్యల ప్రభావం టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌పై భారీ ప్రభావం చూపింది. పెనాల్టీకి ముందు భారత్ 16 పాయింట్లు మరియు 44.44 పాయింట్ల శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా భారత్ ర్యాంక్ ఆరో స్థానానికి (38.89) పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో తొలిస్దానంలో ఉండిన టీమిండియా ఒక్కసారిగా భారీగా పాయింట్లు కోల్పోయి ఆరో స్థానానికి దిగజారింది.
మరోవైపు భారత్‌పై అద్బుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో (12 పాయింట్లు) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. రెండో టెస్ట్‌లోనూ పాక్‌ను మట్టికరిపించడంతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (50.00) రెండో స్థానంలో.. బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (45.83) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఇదిలా ఉంటే, కేవలం మూడు రోజుల్లో ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్‌తో పాటు కేవలం శుభ్‌మన్ గిల్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు.
టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment