ప్రతి జ్ఞాపకం మదిలో పదిలం!
సొంత మైదానం అంటే సొంత ఊరు, ఆట నేర్చుకున్న చోటే కాదు... శిఖరానికి చేరి తమదైన ముద్ర వేసిన చోట జనం మనల్ని సొంతం చేసుకోవటం కూడా. అలా చూస్తే ఈడెన్ గార్డెన్స్..... హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌కు సొంత గడ్డలాంటిదే. బెంగాలీలు కూడా పదమూడేళ్ల క్రితమే లక్ష్మణ్‌ను తమవాడిగా చేసుకున్నారు. ఆ మైదానంలో లక్ష్మణ్ పరుగుల వరద పారించాడు.
ఎన్నో రికార్డులు తిరగరాశాడు. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్‌కు 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. వీవీఎస్ కూడా తన అద్భుత ఆటతో ఇన్నేళ్ల ఈ స్టేడియం చరిత్రలో భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా ఈడెన్ మైదానంతో తనకు ఉన్న అనుబంధాన్ని లక్ష్మణ్ ‘సాక్షి'తో పంచుకున్నాడు.
విశేషాలు అతని మాటల్లోనే...
తొలి మ్యాచ్ ఇంకా గుర్తుంది: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌తో నా అనుబంధం ప్రత్యేకం. మొదటినుంచి ఆ మైదానం గొప్పతనం గురించి చాలా సార్లు విన్నాను. అక్కడ నేను ఆడిన తొలి మ్యాచ్ ఇంకా బాగా గుర్తుంది. 1994లో ఏదో ప్రత్యేక వేడుకల్లో భాగంగా పి.సేన్ ట్రోఫీ పేరుతో ఒక ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహించారు.
అండర్-19 స్థాయిలో ఆ టోర్నీ జరిగింది. నేను భారత జట్టు తరఫున బరిలోకి దిగాను. పలువురు భారత క్రికెటర్లతో కలిపి అప్పుడు కంబైన్డ్ ఎలెవన్ టీమ్‌ను కూడా తయారు చేశారు. నేను ఆ మ్యాచ్‌లో 22 పరుగులు చేశాను. ఈడెన్‌లో ఆ సమయంలో లక్ష మంది ప్రేక్షకులు ఉన్నారు. అంత మంది ముందు ఆడటం చాలా గొప్పగా అనిపించింది.
ఆ అభిమానం మరువలేం: ఈడెన్‌లో ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంటుంది. అక్కడి ప్రేక్షకులకు క్రికెట్ అంటే, ఇంకా చెప్పాలంటే క్రీడలంటేనే ఎంతో అభిమానం చూపిస్తారు. ఆటగాళ్లపై కూడా వారు అంతే స్థాయిలో అభిమానం కురిపిస్తారు. వారి ఆతిథ్యం, మనల్ని ఆహ్వనించే తీరు...
ఇలా అన్నింటిలో దానిని ప్రదర్శిస్తారు.
ప్రత్యేక అనుభూతి: కోల్‌కతా నగరం కూడా ఎంతో బాగుంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో దిగి నగరంలోకి వస్తున్నప్పుడే నాకు కోల్‌కతా గురించి ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఆనాటినుంచి ఎప్పుడు కోల్‌కతాలో క్రికెట్ ఆడినా అదో రకమైన ఆనందం అనిపిస్తుంది. ఈడెన్‌లో ప్రతిసారీ బాగా ఎంజాయ్ చేశాను.
ఎంత చెప్పినా తక్కువే: ఆటపరంగా చూస్తే ‘281’ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదొక్కటే కాదు ఆ తర్వాత కూడా ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఈడెన్‌లో ఆడాను. బెంగాల్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వెళ్లనుండటానికి కోల్‌కతాతో అనుబంధం ఒక్కటే కారణం కాదు గానీ... ఇకపై కూడా నేను ఈడెన్‌తో జత కలవనుండటం సంతోషకరం. నా ఫేవరెట్ గ్రౌండ్ ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుండటం సంతోషకరమైన సందర్భం.