క్రికెటర్లు స్టార్క్, స్టీవ్ స్మిత్, డివిలియర్స్, రబడ
సాక్షి, స్పోర్ట్స్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా పటిష్ట ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. పేస్‌కు స్వర్గదామమైన డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్డేడియంలో ఆసీస్ పేసర్లను ఎదుర్కోవడం సఫారీలకు పెద్ద సవాల్. సొంతగడ్డపై ఇటీవల జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు టెస్టు సిరీస్ నెగ్గినా.. అందులో టీమిండియా పేసర్లను ఎదుర్కోలేకపోయారు. భారత బౌలర్ల కంటే ఆసీస్ పేసర్లు మరింత వేగంగా బంతులేస్తారన్నది తెలిసిందే. బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు అవసరమైతే స్లెడ్జింగ్ లాంటి వాటిలో ఆసీస్ క్రికెటర్లు ముందుంటారు. అసలే సొంతగడ్డ మీద కంగారూలతో 14 సిరీస్‌ల్లో తలపడిన ప్రొటీస్ జట్టు కేవలం 2 సిరీస్‌లు మాత్రమే నెగ్గింది.
1970 తర్వాత సొంతగడ్డలో ఆసీస్‌పై టెస్ట్ సిరీస్ నెగ్గలేదన్న చెత్త రికార్డును చెరిపేయాలని సఫారీ టీమ్ భావిస్తోంది. అయితే భారత యువ బౌలర్లు కుల్దీప్, చహల్‌లను సరిగా ఎదుర్కోలేక ఆపసోపాలు పడ్డ సఫారీలకు ఆసీస్‌తో తాజా టెస్ట్ సిరీస్ సవాల్‌గా నిలువనుంది. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజల్‌వుడ్, నాథన్ లయన్‌లతో పటిష్టంగా ఉన్న ఆసీస్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కోవాలంటే మానసికంగా సన్నద్ధం కావాలి. అసలే టీమిండియా చేతిలో వన్డే, టీ20ల్లో సిరీస్‌లు కోల్పోయిన సఫారీ జట్టు ఏ మేరకు ఆసీస్‌కు పోటీ ఇస్తుందో చూడాలి. మరోవైపు 2016లో ఆసీస్‌లోనే తమను ఓడించిన సఫారీలను చిత్తు చేయాలని స్టీవ్ స్మిత్ సేన ప్రతీకారేచ్ఛతో ఉంది. మధ్యాహ్నం గం. 1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment