హై‘డ్రా’మా... | Faf du Plessis, AB de Villiers heroics in vain as India snatch honourable draw | Sakshi
Sakshi News home page

హై‘డ్రా’మా...

Published Mon, Dec 23 2013 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

డు పెస్లిస్ రనౌట్ కావడంతో ఆనందంలో జహీర్ ఖాన్

డు పెస్లిస్ రనౌట్ కావడంతో ఆనందంలో జహీర్ ఖాన్

మహాద్భుతం... వాండరర్స్‌లో తొలి టెస్టు ఫలితాన్ని వర్ణించేందుకు ఈ మాట సరిపోదు.  ఎవరన్నారు టెస్టు క్రికెట్ చచ్చిపోతోందని... టెస్టులపై ఆసక్తి తగ్గిపోయిందని... జొహన్నెస్‌బర్గ్‌లో చివరి రోజు ఆటను చూసినవారు ఈ మ్యాచ్‌లో ‘డ్రా’మాను ఎప్పటికీ మరచిపోలేరు.
 
 ఎన్నెన్నో మలుపులు... మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు... ఒకరివైపు మొగ్గిన విజయం అంతలోనే మరొకరి పక్షాన నిలుస్తూ వచ్చింది. మ్యాచ్ చివరి రోజు ఆఖరి బంతి వరకు టెస్టు క్రికెట్‌లో ఫలితం కోసం ఎదురు చూడాల్సి రావడం అంటే ఆ మ్యాచ్ గొప్పతనం ఏమిటో అర్థ్ధమవుతోంది.
 
 చివరి రోజు విజయానికి దక్షిణాఫ్రికా చేయాల్సిన పరుగులు 320... భారత్‌కు 8 వికెట్లు... మ్యాచ్ మన వైపే ఉంది.
 
 197 వద్ద నాలుగో వికెట్ పడింది....
 ఫర్వాలేదు, భారత్ ఇంకా విజయానికి చేరువైనట్లే... కనీసం ‘డ్రా’ కోసమైనా దక్షిణాఫ్రికా ప్రయత్నించగలదా అనే సందేహం.
 
 అనూహ్యంగా భారత బౌలర్ల వెనుకంజ...
 డు ప్లెసిస్, డివిలియర్స్ 205 పరుగుల భాగస్వామ్యం... సఫారీలు విజయంపై గురి పెట్టారు.
 విజయం కోసం దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 56 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లు. ఇక మ్యాచ్ చేజారినట్లే అనిపించింది. డివిలియర్స్‌ను అవుట్ చేసి ఇషాంత్ ఆనందం నింపాడు. ఆ వెంటనే డుమిని కూడా వెనుదిరిగాడు. జట్టులో మళ్లీ ఆశలు...
  అయినా సరే డు ప్లెసిస్ ఉన్నాడు. అతను, ఫిలాండర్ అప్పటికే షాట్లు మొదలు పెట్టారు. 20 బంతుల్లో 16 పరుగులు చాలు. ఊహించని విధంగా డు ప్లెసిస్ రనౌట్.
 
 అంతే... ప్రొటీస్ వెనక్కి తగ్గారు. వికెట్లు కోల్పోకూడదని నిలబడ్డారు. విజయానికి కేవలం 8 పరుగుల దూరంలో జట్టు ఆగిపోయింది.
 
 ఓటమి తప్పిందనే ఆనందం టీమిండియాలో... నెగ్గకున్నా పరాజయాన్ని తప్పించుకోగలిగామన్న సంతృప్తి ప్రత్యర్థిలో... ఫలితం ఏదైనా ఇరు జట్లు ఒక గొప్ప మ్యాచ్‌లో భాగమయ్యాయి.
 
 జొహన్నెస్‌బర్గ్: హమ్మయ్య... ఓటమికి చేరువగా వచ్చిన మ్యాచ్‌లో భారత్ గట్టెక్కింది. మలుపులు తిరుగుతూ చివరి వరకు ఆసక్తికరంగా సాగిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. 458 పరుగుల విజయలక్ష్యం ఛేదించే క్రమంలో 138/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది.
 
 ఫాఫ్ డు ప్లెసిస్ (309 బంతుల్లో 134; 15 ఫోర్లు), ఏబీ డివిలియర్స్ (168 బంతుల్లో 103; 12 ఫోర్లు) అద్భుత శతకాలతో ఒక దశలో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు విజయానికి చేరువైనట్లు కనిపించింది. అయితే వీరిద్దరు అవుటయ్యాక సఫారీలు తమ పోరాటాన్ని ఆపేశారు.
 
  స్టేడియంలోని తమ అభిమానుల ఆగ్రహానికి గురైనా... చివర్లో వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి ‘డ్రా’గా ముగించారు. ఆఖరి రోజు ఆట ఆరంభానికి ఎలాంటి ఆశలు లేని దక్షిణాఫ్రికా ఇక్కడి వరకు మ్యాచ్ తీసుకు రాగా... నాలుగు రోజుల పాటు ఆధిక్యం ప్రదర్శించినా ఒక్క రోజు వైఫల్యంతో టెస్టులో భారత్‌కు విజయం దక్కకుండా పోయింది. విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు 26 నుంచి డర్బన్‌లో జరుగుతుంది.
 
 కట్టడి చేసిన బౌలర్లు....
 138/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొదట్లో తడబడింది. 14 బంతులు ఆడినా తన ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే పీటర్సన్ (162 బంతుల్లో 76; 9 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. అయితే డు ప్లెసిస్, కలిస్ (37 బంతుల్లో 34; 6 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఈ భాగస్వామ్యం 54 పరుగులకు చేరిన అనంతరం దురదృష్టవశాత్తూ కలిస్ అవుటయ్యాడు. జహీర్ బౌలింగ్‌లో బంతి బ్యాట్‌కు తగిలినా అంపైర్ నిర్ణయంతో కలిస్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఇది జహీర్ కెరీర్‌లో 300వ వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత డు ప్లెసిస్, డివిలియర్స్ క్రీజ్‌లో నిలదొక్కుకొని మరో వికెట్ పడకుండా సెషన్ ముగించారు.
 
 కీలక భాగస్వామ్యం...
 రెండో సెషన్‌లో పూర్తిగా దక్షిణాఫ్రికా ద్వయం ఆధిపత్యం ప్రదర్శించింది. ఇద్దరూ చక్కటి షాట్లతో దూసుకుపోయారు. భారత బౌలర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోవడంతో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆశించిన విధంగా చివరి రోజు పిచ్ బౌలర్లకు పెద్దగా సహకరించకపోవడం, బ్యాటింగ్‌కు ఇంకా అనుకూలంగానే ఉండటంతో డు ప్లెసిస్, డివిలియర్స్ స్వేచ్ఛగా ఆడారు. ఈ సెషన్‌లో భారత్‌కు ఒక్క వికెట్టూ దక్కలేదు.
 
 అనూహ్య మలుపులు...
 టీ విరామం తర్వాత దక్షిణాఫ్రికా విజయంపై కన్నేసింది. ఈ క్రమంలో డు ప్లెసిస్ 252 బంతుల్లో, డివిలియర్స్ 162 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు ఇషాంత్ బౌలింగ్‌లో డివిలియర్స్ వెనుదిరగడంతో మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. డివిలియర్స్ వికెట్లపైకి ఆడుకోగా, తర్వాతి ఓవర్లోనే డుమిని (5) కూడా షమీ బౌలింగ్‌లో అదే తరహాలో అవుటయ్యాడు. డు ప్లెసిస్ రనౌట్‌తో సఫారీలు ఆత్మ రక్షణలో పడిపోయారు.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 280
 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 244
 భారత్ రెండో ఇన్నింగ్స్: 421
 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: పీటర్సన్ (బి) షమీ 76; స్మిత్ రనౌట్ 44; ఆమ్లా (బి) షమీ 4; డు ప్లెసిస్ రనౌట్ 134; కలిస్ ఎల్బీడబ్ల్యూ (బి) జహీర్ 34; డివిలియర్స్ (బి) ఇషాంత్ 103, డుమిని (బి) షమీ 5; ఫిలాండర్ నాటౌట్ 25; స్టెయిన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 450
 వికెట్ల పతనం: 1-108, 2-118, 3-143, 4-197, 5-402, 6-407, 7-442
 బౌలింగ్: జహీర్ 34-1-135-1, ఇషాంత్ 29-4-91-1, షమీ 28-5-107-3, అశ్విన్ 36-5-83-0, మురళీ విజయ్ 1-0-3-0, ధోని 2-0-4-0, కోహ్లి 6-0-18-0.
 
 ‘నాలుగు రోజుల పాటు భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. అయినా మానసికంగా మేం బలంగా ఉండటం వల్ల ఇక్కడి వరకు మ్యాచ్‌ను తీసుకు రాగలిగాం. గెలిస్తే ఇంకా బాగుండేది కానీ డు ప్లెసిస్ రనౌట్ దురదృష్టకరం. వారిద్దరి ఇన్నింగ్స్‌లు చరిత్రలో నిలిచిపోతాయి. మోర్కెల్ వంద శాతం ఫిట్‌గా లేడు. అతను ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేడనే డ్రా కోసం సిద్ధమైపోయాం’
 -గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా కెప్టెన్
 
 మలుపు తిప్పిన రనౌట్
 దక్షిణాఫ్రికా విజయానికి 20 బంతుల్లో 16 పరుగులు అవసరం... డుప్లెసిస్ అదే ఓవర్లో భారీ షాట్‌తో తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. అతను క్రీజ్‌లో ఉంటే సఫారీ విజయం లాంఛనమే అనిపించింది. అయితే నాలుగు గంటల పాటు బ్యాటింగ్ చేసిన డు ప్లెసిస్ కూడా ఒత్తిడిని తట్టుకోలేకపోయాడేమో... లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.
 
 
 జహీర్ బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా నెట్టి సింగిల్ కోసం దూసుకొచ్చాడు. అయితే చురుగ్గా ఉన్న అజింక్యా రహానే విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకింది. థర్డ్ అంపైర్ అవుట్ ఖరారు చేయడంలో డు ప్లెసిస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ పరిణామంతోనే దక్షిణాఫ్రికా విజయాన్ని పక్కన పెట్టింది. ఫిలాండర్, స్టెయిన్ చివరి 19 బంతులు ‘డ్రా’ కోసమే ఆడారు. అన్నట్లు నాలుగో రోజు ఇదే రహానే మిడాన్ నుంచి డెరైక్ట్ త్రోతో గ్రేమ్ స్మిత్‌ను పెవిలియన్ పంపించి ప్రత్యర్థి పతనాన్ని ప్రారంభించాడు.
 
 డు ప్లెసిస్ మరోసారి!
 జట్టును డుప్లెసిస్ పరాజయం బారి నుంచి తప్పించడం ఇది మొదటి సారి కాదు. ఏడాది క్రితం అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో టెస్టును అతను ఇదే తరహాలో రక్షించాడు. 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు దక్షిణాఫ్రికా 45/4 స్కోరుతో ఉన్న దశలో బరిలోకి దిగాడు. కెరీర్‌లో అది తొలి టెస్టు మ్యాచ్ అయినా దాదాపు ఎనిమిది గంటలు ఆడి 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని పోరాటంతో జట్టు ఈ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించగలిగింది.
 
 జహీర్ ఖాన్ @ 300
 భారత ప్రధాన పేస్ బౌలర్ జహీర్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో జహీర్ 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో జాక్ కలిస్‌ను ఎల్బీగా అవుట్ చేసి అతను ఈ రికార్డును చేరుకున్నాడు. జహీర్ భారత్ తరఫున 300 వికెట్లను సాధించిన నాలుగో బౌలర్. అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (413) అంతకంటే ముందున్నారు. 13 ఏళ్ల కెరీర్‌లో 89 టెస్టులు ఆడిన జహీర్ 32.35 సగటుతో ఈ వికెట్లు పడగొట్టాడు. గత దశాబ్ద కాలంలో విదేశీ గడ్డపై భారత జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఖాన్... తన కెరీర్‌లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 10 సార్లు, టెస్టులో 10 వికెట్లు ఒకసారి తీసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 7/87 కాగా, టెస్టులో 10/149గా ఉంది.
 
 తొలి సెషన్     ఓవర్లు: 29, పరుగులు: 98, వికెట్లు: 2
 రెండో సెషన్     ఓవర్లు: 31, పరుగులు: 95, వికెట్లు: 0
 మూడో సెషన్    ఓవర్లు: 31, పరుగులు: 119, వికెట్లు: 3
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement