
అయితే ఇక్కడికి వచ్చినప్పుడు హోటల్స్, ఫుడ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని అర్థమైంది. హోటల్ రూమ్‌లు, ఆహారం అంత బాగా ఉండకపోయినా మైదానాలు సవాళ్లను విసురుతాయి
రాంచీ: దక్షిణాఫ్రికా క్రికెటర్ డీన్ ఎల్గర్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. రాంచీ టెస్టు ప్రారంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ సేషన్‌లో ఎల్గర్ మీడియాతో సరదాగా సంభాషించాడు. ఈ క్రమంలో భారత పర్యటన ముగుస్తున్న తరుణంలో మీ అనుభవాలను తెలపాలంటూ ఎల్గర్‌ను మీడియా ప్రతినిధి అడిగాడు. దీనికి సమాధానంగా ‘వ్యక్తిగా, క్రికెటర్‌గా ఈ పర్యటన ఎంతో లాభించింది. ఈ పర్యటనలో ఎంతో నేర్చుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు హోటల్స్, ఫుడ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని అర్థమైంది. హోటల్ రూమ్‌లు, ఆహారం అంత బాగా ఉండకపోయినా మైదానాలు సవాళ్లను విసురుతాయి’అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఎల్గర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ఓటమికి సాకులను వెతికే క్రమంలో సఫారీ ఆటగాళ్లు ఉన్నారంటూ మండిపడుతున్నారు. ‘కేప్‌టౌన్‌లో భారత క్రికెటర్లు షవర్ బాత్ చేయడానికి హోటల్ సిబ్బంది కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయమచ్చిన విషయం గుర్తుందా ఎల్గర్?’, ‘ ఇక్కడి ప్రదేశాలు, ఆహారం, అలవాట్ల గురించి మీ దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ దగ్గరికి వెళ్లి నేర్చుకో’అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక ఎల్గర్ గత పర్యటనలో భారత పిచ్‌లను విమర్శించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. రాంచీ టెస్టులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ఆరాటపడుతోంది.