South Africa vs India, 2nd Test : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా గెలుపు అవకాశాలపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్‌ను తొందరగా అవుట్ చేస్తే రోహిత్ సేన పని సులువు అవుతుందని పేర్కొన్నాడు.
కేప్‌టౌన్‌లో ఎల్గర్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గానూ బరిలోకి దిగుతున్న కారణంగా అతడిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. టీమిండియా బౌలర్లు దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించాడు. ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చడం కష్టమేమీ కాబోదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
కేప్‌టౌన్‌లో అంత ఈజీ కాదు
కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో ఓడిన టీమిండియా కేప్‌టౌన్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అయితే, సీమర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్‌పై ఆతిథ్య జట్టు బౌలర్లు మరోసారి చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో రోహిత్ సేన ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
కెప్టెన్ కాబట్టి ఒత్తిడి సహజం
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘డీన్ ఎల్గర్ కెరీర్‌లో ఇది ఆఖరి టెస్టు. తెంబా బవుమా జట్టుతో లేడు కాబట్టి ఎల్గర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పుడు తన దృష్టి మొత్తం కేవలం రన్స్ తీయడం కాకుండా.. ట్రోఫీ గెలవడం పైనే ఉందని ఇప్పటికే ఎల్గర్ స్పష్టం చేశాడు. కాబట్టి అతడిపై ఒత్తిడి ఉండటం సహజం. నా దృష్టిలో అయితే.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగానే ఉంది.
డీన్ ఎల్గర్ బ్యాటింగ్ కూడా సాధారణంగానే ఉంది. అయితే, అతడిని అవుట్ చేయడం అంత తేలికేమీ కాదు. ఒక్కసారి ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే మాత్రం మిగతా బ్యాటర్లు కూడా క్యూ కట్టడం ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
కేశవ్ మహరాజ్‌ను ఆడిస్తారు!
అదే విధంగా.. పేసర్ గెరాల్డ్ కోయెట్జీ గాయపడటం సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బేనన్న ఆకాశ్ చోప్రా.. అతడి స్థానంలో లుంగీ ఎంగిడీ జట్టులోకి వచ్చే అవకాశం లేదన్నాడు. ఎంగిడి దాదాపు ఏడాది కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు కాబట్టి మేనేజ్‌మెంట్ అతడి వైపు మొగ్గు చూపకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను రెండో టెస్టులో ఆడించే అవకాశాలు ఉన్నాయని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment