
బెంగళూరు: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానుల కంటపడకుండా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోనే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు యో యో టెస్టు కోసం సహచరులతో పాటే ఇక్కడికి వచ్చిన ధోని... 15న టెస్టు ముగిశాక రాంచీకి వెళ్లకుండా ఎన్‌సీఏలోనే చెమటోడ్చుతున్నాడు. కఠినమైన ఇంగ్లండ్ పర్యటన కోసం ఈ ‘మిస్టర్ కూల్’ సాధనలో నిమగ్నమయ్యాడు. బంతిని వేగంగా విసరడంలో సిద్ధహస్తుడైన రఘు, స్పీడ్‌స్టర్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌ను ఎక్కువగా ఆడాడు.
రెండున్నర గంటలపాటు 18 గజాల దూరం నుంచి రఘు, శార్దుల్ విసిరిన బంతుల్ని ప్రాక్టీస్ చేయడం గమనార్హం. మిడ్ వికెట్, ఎక్స్‌ట్రా కవర్, డీప్‌ఫైన్ లెగ్‌లో షాట్లు కొట్టే విధంగా శార్దుల్‌తో అడిగిమరి బౌలింగ్ వేయించుకున్నాడు. ఈ సెషన్‌లో సిద్ధార్థ్ కౌల్ కూడా పాల్గొన్నాడు. అతని ప్రాక్టీస్‌ను పెద్దసంఖ్యలో అభిమానులు తిలకించారు. వారిని ఉద్దేశించి ‘మొత్తానికి నేనిక్కడ ఉన్నానని తెలుసుకున్నారు’ అంటూ ధోని నిష్క్రమించాడు.