మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో ఎన్నడూ లేనంతగా ఆగ్రశ్రేణి జట్లు నాకౌట్ చేరడానికి నానాతంటాలు పడుతున్నాయి. పసికూనలు అనుకున్న జట్లే పంజా విసిరి పెద్ద జట్లకు షాక్ ఇస్తున్నాయి. ప్రపంచకప్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ సులభంగా నాకౌట్‌కు చేరుతుందనుకున్నారు. కానీ లీగ్ చివరి మ్యాచ్‌లో సెర్బియాపై గెలిస్తేనే రౌండ్ 16కి వెళ్లే అవకాశం.. డ్రా అయితే కొంచెం కష్టం ఇది సాంబా జట్టు పరిస్థితి. అలాంటి మ్యాచ్‌లో బెబ్బులిలా పంజా విసిరింది. బుధవారం గ్రూప్ ఈలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0తో సెర్బియాను చిత్తు చేసింది.
మ్యాచ్ ప్రారంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన బ్రెజిల్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో సాంబా జట్టు స్టార్ నెమార్ చిరుతలా కదిలాడు. ఇక మిగిలిన ఆటగాళ్లు కూడా నెమార్ మీదే ఆధారపడకుండు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ప్రథమార్థంలో నెమార్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను మిడ్ ఫీల్డర్ పాలిన్హో హెడర్ గోల్ చేసి బ్రెజిల్ జట్టుకు తొలి గోల్ అందిచాడు. తొలి భాగం ముగిసే సరికి బ్రెజిల్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
రెండో భాగంలో బ్రెజిల్ మరో గోల్ నమోదు చేయడానికి చాలా సమయమే పట్టింది. బ్రెజిల్ చేసిన గోల్ ప్రయత్నాలను సెర్బియా రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. 68వ నిమిషంలో టి సిల్వా మరో గోల్ చేసి జట్టుకు మరింత ఆధిక్యాన్ని పెంచాడు. రెండో భాగం ముగిసినా, ఇంజ్యూరీ టైమ్‌లో కూడా మరో గోల్ నమోదు కాకపోవడంతో బ్రెజిల్ విజయం సాధించింది. దీంతో గ్రూప్ ఈ లో టాపర్‌గా రౌండ్ 16 లోకి అడుగుపెట్టింది. జులై 2 న నాకౌట్ పోరులో మెక్సికోతో బ్రెజిల్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment