షరపోవా ఇంటికి... | First Serena Williams, now Maria Sharapova out at the Australian Open | Sakshi
Sakshi News home page

షరపోవా ఇంటికి...

Published Tue, Jan 21 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

షరపోవా ఇంటికి...

షరపోవా ఇంటికి...

సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ బాటనే అనుసరిస్తూ మరో ఫేవరెట్ షరపోవా ఇంటిముఖం పట్టింది. తనదైన రోజున అద్భుతంగా ఆడే స్లొవేకియా అమ్మాయి డొమినికా సిబుల్కోవా ధాటికి మూడో సీడ్ షరపోవా ప్రిక్వార్టర్స్‌లోనే నిష్ర్కమించింది.
 
 మెల్‌బోర్న్: ఈసారి అగ్రశ్రేణి క్రీడాకారిణులకు ఆస్ట్రేలియన్ ఓపెన్ కలసి రావడంలేదు. టైటిల్ ఫేవరెట్స్ ఒక్కొక్కరూ చేతులెత్తేస్తున్నారు. ఆదివారం టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ అనూహ్య ఓటమిని మర్చిపోకముందే మూడో సీడ్ షరపోవా రూపంలో మరో స్టార్ పరాజయం పాలైంది. భుజం గాయం నుంచి కోలుకున్న ఈ రష్యా భామ ప్రిక్వార్టర్స్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది.

 సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 20వ సీడ్ డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా) 3-6, 6-4, 6-1 తో షరపోవాను బోల్తా కొట్టించి తన కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి సెట్‌లో దూకుడుగా ఆడిన షరపోవా ఆ తర్వాత తడబడింది. సిబుల్కోవా చెలరేగి రెండో సెట్‌లో 5-0తో దూసుకెళ్లింది. ఆ తర్వాత గాడితప్పి నాలుగు గేమ్‌లు కోల్పోయినా కీలకదశలో రాణించి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో సిబుల్కోవా హడలెత్తించి షరపోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సంచలన విజయాన్ని ఖాయం చేసుకుంది.

 మ్యాచ్ మొత్తంలో షరపోవా ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు, 45 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ‘షరపోవాను ఓడిస్తాననే వంద శాతం నమ్మకంతో కోర్టులోకి అడుగుపెట్టాను. గతంలోనూ ఆమెను గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఓడించాను. ఏడో ప్రయత్నంలో ఈ టోర్నీలో క్వార్టర్స్ దశకు చేరినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని సిబుల్కోవా వ్యాఖ్యానించింది.
 
 మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫలితాలు
     రెండో సీడ్ అజరెంకా (బెలారస్) 6-3, 6-2తో 13వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై...
     11వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 6-4, 2-6, 6-0తో ఎనిమిదో సీడ్ జంకోవిచ్ (సెర్బియా)పై...
     ఐదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-1, 6-3తో గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై గెలిచారు.
 
      {శమించిన నాదల్...
 పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)కు తొలిసారి గట్టిపోటీ ఎదురైంది. 3 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 7-6 (7/3), 7-5, 7-6 (7/3)తో 16వ సీడ్ నిషికోరి (జపాన్)పై కష్టపడి గెలిచాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ‘షరపోవా బాయ్‌ఫ్రెండ్’ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో నాదల్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ దిమిత్రోవ్ 6-3, 3-6, 6-2, 6-4తో అగుట్ (స్పెయిన్)ను ఓడించి కెరీర్‌లో తొలిసారి  గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు చేరాడు.
 
      ఫెడరర్ ఫటాఫట్...
 కొత్త రాకెట్‌తో ఆడుతోన్న ఆరో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) తన విజయపరంపర కొనసాగిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా 11వ ఏడాది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 10వ సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 6-3, 7-5, 6-4తో గెలిచాడు.  మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో ఫెడరర్ తలపడతాడు.
     మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆండీ ముర్రే 6-1, 6-2, 6-7 (6/8), 6-2తో ‘లక్కీ లూజర్’ స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
 
      క్వార్టర్స్‌లో సానియా జోడి
 భారత స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్ విభాగంలో, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. మహిళల డబుల్స్ మూడో రౌండ్‌లో సానియా-కారా బ్లాక్ (జింబాబ్వే) జంట 6-4, 6-3తో వెరా దుషెవినా (రష్యా)-యూజిన్ బౌచర్డ్ (కెనడా) ద్వయంపై గెలిచింది. ఆ తర్వాత మిక్స్‌డ్ డబుల్స్ మూడో రౌండ్‌లో సానియా-హొరియా టెకావ్ (రుమేనియా) జంట 6-2, 6-2తో రొడియోనోవా (ఆస్ట్రేలియా)-కొలిన్ ఫ్లెమింగ్ (బ్రిటన్) జోడిని ఓడించింది.

మిక్స్‌డ్ డబుల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్ (భారత్)-హంతుచోవా (స్లొవేకియా) జంట 6-0, 2-6, 10-6తో మహేశ్ భూపతి (భారత్)-ఎలీనా వెస్నినా (రష్యా) ద్వయంపై... రోహన్ బోపన్న (భారత్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంట 7-6 (7/5), 7-5తో యాష్లీ బార్టీ-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడిలపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాయి.
 
     {బయాన్ బ్రదర్స్‌కు షాక్
 పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్స్ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జోడికి మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. అన్‌సీడెడ్ జోడి క్లాసెన్  (దక్షిణాఫ్రికా)- బుటోరాక్ (అమెరికా) 7-6 (11/9), 6-4తో బ్రయాన్ బ్రదర్స్‌ను కంగుతినిపించి క్వారర్స్‌కి చేరారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement