అవివాహిత బాక్సర్లకు గర్భనిర్ధారణ పరీక్షలు!
న్యూఢిల్లీ: భారత క్రీడారంగం సిగ్గు పడే, మహిళలు క్రీడలను ఎంచుకునేందుకు తటపటాయించే ఘటన బాక్సింగ్ లో చోటు చేసుకుంది. ప్రపంచ చాంఫియన్ షిప్ లో పాల్గొనబోతున్న ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. బాక్సింగ్ ఇండియా (బీఐ) సూచనల మేరకు ఇది జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా సాయ్ వైద్య సలహాదారు డాక్టర్ పీఎస్ఎం చంద్రన్ బయటపెట్టారు. వీరిలో పెళ్లికానివారు, జూనియర్ బాక్సర్లు కూడా ఉన్నారు.
భారత్ కు ఆడాలనే ఆశతో ఉన్న మహిళా బాక్సర్లు తమ బాధను బయటికి వ్యక్త పర్చలేకపోయారని, ఆధికారుల ఆదేశాలను పాటిస్తూ పరీక్షకు హాజరయ్యారని చంద్రన్ చెప్పారు. అసలు ఏఐబీఏ నిబంధన ప్రకారం బాక్సర్లకు గర్భ నిర్ఱారణ పరీక్షలు జరపాలని ఎక్కడా లేదు. సాధారణ వైద్య పరీక్షల అనంతరం ఆ సర్టిఫికెట్ తో పాటు బాక్సర్లు సొంత పూచీపై నాన్ ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపువారైతే తల్లితండ్రులు ఈ డిక్లరేషన్ సమర్పించాలి.