హామిల్టన్‌దే బోణీ
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో విజేత
మెల్‌బోర్న్: గత సీజన్‌ను విజయంతో ముగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కొత్త సీజన్‌నూ విజయంతోనే ప్రారంభించాడు. ఆదివారం జరిగిన 2015 ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్‌లో 34వ విజయాన్ని నమోదు చేశాడు. 58 ల్యాప్‌ల ఈ రేసును ఈ బ్రిటిష్ డ్రైవర్ గంటా 31 నిమిషాల 54.067 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు.
చివరి నిమిషంలో ఉపసంహరణలు... సాంకేతిక సమస్యలు... చిన్నపాటి ప్రమాదాలు... తదితర కారణాలు సీజన్ తొలి రేసును పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. విలియమ్స్ జట్టు డ్రైవర్ బొటాస్ గాయం కారణంగా... మనోర్ మారుసియా జట్టు తమ కార్లను సకాలంలో సిద్ధం చేయకపోవడంతో తొలి రేసులో పాల్గొనలేదు. ఫలితంగా 1963 తర్వాత ఒక సీజన్‌లోని తొలి రేసులో కనిష్టంగా 15 మంది బరిలోకి దిగారు. రేసు మొదలయ్యాక ఆరుగురు డ్రైవర్లు రైకోనెన్, వెర్‌స్టాపెన్, గ్రోస్యెన్, మల్డొనాడో, క్వియాట్, మాగ్నుసెన్ మధ్యలోనే వైదొలిగారు.
‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ చివరి వరకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ విజేతగా నిలిచాడు. సెకను తేడాతో మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలువగా... ఫెలిప్ మసా (విలియమ్స్) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు టాప్-10లో నిలువడం విశేషం.
హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని ... సెర్గియో పెరెజ్ పదో స్థానాన్ని సాధించాడు. ఓవరాల్‌గా 11 మది డ్రైవర్లే రేసును పూర్తి చేయగలిగారు. ఎస్టీఆర్ జట్టు తరఫున బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ వెర్‌స్టాపెన్ 17 ఏళ్ల 166 రోజుల ప్రాయంలో అరంగేట్రం చేసి ఫార్ములావన్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. అయితే అతనికి తొలి రేసు కలిసిరాలేదు. కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో వెర్‌స్టాపెన్ 32వ ల్యాప్‌లో వైదొలిగాడు. తదుపరి రేసు మలేసియా గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది.