ఇండోర్: ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్బ పేసర్ రజ్నీస్ గుర్బానీ పదునైన బంతులతో చెలరేగిపోయాడు. ఇందులో హ్యాట్రిక్ వికెట్లను సాధించి పటిష్టమైన ఢిల్లీని బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ 100 ఓవర్ ఐదో బంతికి వికాశ్ మిశ్రాను అవుట్ చేసిన గుర్బానీ.. ఆ తరువాత బంతికి నవదీప్ షైనీని బోల్తా కొట్టించాడు. ఇక 102 ఓవర్ తొలి బంతికి ధ్రవ్ షోరేను అవుట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కు ఊపిరాడకుండా చేసి ఆరు వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. గుర్బానీ ఆరు వికెట్లకు జతగా ఆదిత్య థాకరే రెండు వికెట్లు సాధించగా, సిద్దేశ్ నెరాల్, అక్షయ్ వాఖారేలకు తలో వికెట్ తీశారు.
రంజీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన విదర్బ.. అంచనాల మించి రాణిస్తోంది. ప్రధానంగా గుర్బానీ తన పేస్‌తో ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నాడు. అంతకముందు కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్లో గుర్బానీ 12 వికెట్లతో సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన గుర్బానీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో మెరిశాడు. దాంతో విదర్బ ఫైనల్‌కు చేరి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఒకవేళ రంజీ టైటిల్ గెలిస్తే మాత్రం ఫైనల్‌కు చేరిన మొదటిసారే టైటిల్ సాధించిన జట్టుగా అరుదైన ఘనతను విదర్బ సొంతం చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment