పోర్వోరిమ్: హైదరాబాద్ బ్యాట్స్‌మన్ గాదె హనుమ విహారి ఈ సీజన్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. ఈ ఏడాది నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన విహారి కీలకమైన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా గోవాతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. విహారి (378 బంతుల్లో 201 నాటౌట్; 24 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ ద్విశతకంతో పాటు కీపర్ హబీబ్ అహ్మద్ (94 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో హైదరాబాద్ 171 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 514 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 33.3 ఓవర్లలోనే 172 పరుగులు జోడించడం విశేషం. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన గోవా 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.
భారీ భాగస్వామ్యం...
234/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజుకంటే వేగంగా ఆడింది. విహారి, సందీప్ కలసి చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. ఈ క్రమంలో సందీప్ కెరీర్‌లో ఎనిమిదో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నిలకడగా ఆడిన విహారి కూడా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. విహారి ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 137 పరుగులు జోడించిన అనంతరం గడేకర్ బౌలింగ్‌లో బందేకర్‌కు క్యాచ్ ఇచ్చి సందీప్ నిష్ర్కమించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అహ్మద్ ఖాద్రీ (0) వెనుదిరగ్గా... షిండే (7) కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.
ఈ దశలో విహారితో హబీబ్ అహ్మద్ జత కలిశాడు. వీరిద్దరు అనూహ్య వేగంతో ధాటిగా ఆడి పరుగులు పిండుకున్నారు. 5.13 పరుగుల రన్‌రేట్‌తో ఈ భాగస్వామ్యం సాగింది. 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల కెరీర్‌లో ఒకే ఒక సిక్స్ కొట్టిన విహారి... ఈ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు బాదడం విశేషం! ఇదే జోరులో హబీబ్ తన కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీని అందుకున్నాడు. మరి కొద్ది సేపటికే తన అత్యధిక స్కోరు (191)ను అధిగమించిన విహారి... తొలి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దాంతో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఐదేళ్ల తర్వాత...
హైదరాబాద్ తరఫున ఒక బ్యాట్స్‌మన్ రంజీ ట్రోఫీలో ఐదేళ్ల తర్వాత డబుల్ సెంచరీ సాధించడం విశేషం. 2008-09 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ 224 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఉన్న జట్టు సభ్యులలో కూడా విహారి ఒక్కడి ఖాతాలోనే ద్విశతకం ఉంది.
విహారి వీర విహారం!
Published Mon, Dec 16 2013 12:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement