
సందీప్ అజేయ డబుల్ సెంచరీ
ముంబై: సర్వీసెస్ బౌలర్లపై హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ బావనక సందీప్ (332 బంతుల్లో 203 నాటౌట్; 22 ఫోర్లు, 3 సిక్సర్లు), సి.వి. మిలింద్ (208 బంతుల్లో 136; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) కదంతొక్కారు. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ రెండో రోజు ఆటలో సందీప్ అజేయ డబుల్ సెంచరీ సాధించగా, మిలింద్ శతక్కొట్టాడు. వీరిద్దరి రికార్డు భాగస్వామ్యంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌సలో 156.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 303/7 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆట కొనసాగించిన హైదరాబాద్‌ను సందీప్, మిలింద్ భారీస్కోరు దిశగా నడిపించారు.
ఈ క్రమంలో తొలి సెషన్లో సందీప్ సెంచరీ పూర్తి చేశాడు. మిలింద్ కూడా క్రీజ్‌లో పాతుకుపోవడంతో పరుగులు రావడం సులభమైంది. వ్యక్తిగత స్కోరు 61, 62 వద్ద ప్రత్యర్థి ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడవడంతో బతికిపోయిన మిలింద్ సెంచరీ దిశగా దూసుకుపోయాడు. సర్వీసెస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ఇద్దరూ జట్టు స్కోరును పెంచారు. వీరి జోరుతో హైదరాబాద్ స్కోరు చూస్తుండగానే 400, 500 పరుగులు దాటింది. సర్వీసెస్ బౌలర్లు రెండు సెషన్ల పాటు శ్రమించినప్పటికీ ఈ జోడీని విడదీయలేకపోయారు. మిలింద్ కూడా సెంచరీ పూర్తి చేశాడు.
ఈ క్రమంలో ఎనిమిదో వికెట్‌కు 267 పరుగులు జోడించాక... జట్టు స్కోరు 543 పరుగుల వద్ద మిలింద్ ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన సిరాజ్ (6) అండతో టీ విరామం అనంతరం సందీప్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 580 పరుగుల వద్ద సిరాజ్ ఔటవడంతో ఇన్నింగ్‌సను డిక్లేర్ చేశారు. సర్వీసెస్ బౌలర్లలో రౌషన్ రాజ్‌కు 5 వికెట్లు లభించారుు. తర్వాత తొలి ఇన్నింగ్‌స ఆడిన సర్వీసెస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్ అన్షుల్ గుప్తా (9) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా, ఆట నిలిచే సమయానికి నకుల్ వర్మ (34 బ్యాటింగ్), రవి చౌహాన్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.