ముగింపు అదిరేనా?
• నేటి నుంచి ప్రపంచ బ్లిట్జ్, ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్
• బరిలో ఆనంద్, హంపి, హారిక
దోహా: ఈ ఏడాది మొత్తం నిలకడగా రాణించిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మరో గొప్ప ప్రదర్శనతో సీజన్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. ఆదివారం మొదలయ్యే ప్రపంచ బ్లిట్జ్, ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో హారికతోపాటు మహిళల విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోనేరు హంపి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2015–2016 గ్రాండ్‌ప్రి క్లాసిక్ విభాగం సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన హంపి ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. ఈ సంవత్సరం రెండు అంతర్జాతీయ టోర్నీల్లో టైటిల్స్ సాధించడంతోపాటు చెంగ్డూ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన హారిక అదే జోరును ఈ మెగా ఈవెంట్‌లోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది.
ఆదివారం కేవలం ప్రారంభోత్సవం జరుగుతుంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు ర్యాపిడ్ విభాగంలో పోటీలు మొదలవుతాయి. ఆ తర్వాత రెండు రోజుల పాటు బ్లిట్జ్ కేటగిరీలో పోటీలుంటాయి. మహిళల ర్యాపిడ్ విభాగంలో మొత్తం 15 రౌండ్‌లు... పురుషుల ర్యాపిడ్ విభాగంలో 15 రౌండ్‌లు... బ్లిట్జ్ విభాగంలో 21 రౌండ్‌లు నిర్వహిస్తారు. మహిళల విభాగంలో 36 మంది... పురుషుల విభాగంలో 120 మంది క్రీడాకారులు బరిలో ఉన్నారు.
భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు, విదిత్ సంతోషి గుజరాతి, ఆధిబన్, సూర్యశేఖర గంగూలీ, దేబాశిష్ దాస్, నీలోత్పల్ దాస్, ఎం.ఆర్.వెంకటేశ్ పాల్గొంటున్నారు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), అరోనియన్ (అర్మేనియా), సెర్గీ కర్జాకిన్ (రష్యా), హికారు నకముర (అమెరికా)లతో పురుషుల విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. నాలుగు లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజేతలకు 40 వేల డాలర్ల చొప్పున అందజేస్తారు. 24వ ర్యాంక్ వరకు ప్రైజ్‌మనీ ఇస్తారు. టాప్–3లో నిలిచిన వారికి ప్రైజ్‌మనీతోపాటు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి.