
నెదర్లాండ్స్ హ్యాట్రిక్
రెండు దశాబ్దాలుగా నెదర్లాండ్స్ జట్టు ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అదే ఆనవాయితీని బ్రెజిల్‌లోనూ కొనసాగిస్తూ డచ్ బృందం ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది.
వరుసగా మూడో విజయం
చిలీపై 2-0తో గెలుపు గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం
నెదర్లాండ్స్, చిలీ జట్లు ముఖాముఖిగా చివరిసారి 86 ఏళ్ల క్రితం 1928 అమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్ క్రీడల ఫైనల్లో తలపడ్డాయి. నిర్ణీత సమయానికి రెండు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దాంతో లాటరీ ద్వారా విజేతను నిర్ణయించగా నెదర్లాండ్స్‌ను అదృష్టం వరించింది.
సావోపాలో: రెండు దశాబ్దాలుగా నెదర్లాండ్స్ జట్టు ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అదే ఆనవాయితీని బ్రెజిల్‌లోనూ కొనసాగిస్తూ డచ్ బృందం ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది. చిలీతో సోమవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి మ్యాచ్‌లో ఈ ‘ఆరెంజ్’ దళం 2-0తో నెగ్గి లీగ్ దశను గెలుపుతో ముగించింది. తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. ఆరు పాయింట్లతో చిలీ రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ తరఫున చేసిన రెండు గోల్స్ సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు (లెరాయ్ ఫెర్, డెపె మెంఫిస్) చేయడం విశేషం. నెదర్లాండ్స్ కెప్టెన్ అర్జెన్ రాబెన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
తొలి అర్ధభాగంలో రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. చిలీ ఆధీనంలో బంతి 68 శాతం ఉన్నప్పటికీ ఆ జట్టు ఒక్కసారి కూడా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్‌ను సంధించలేకపోయింది. మరోవైపు దూకుడైన ఆటతీరుకు మారుపేరైన నెదర్లాండ్స్ గోల్ చేసే అవకాశాలను సృష్టించుకున్నా సఫలం కాలేకపోయింది. మూడుసార్లు గోల్‌పోస్ట్‌పై షాట్‌లు సంధించినా అవి లక్ష్యానికి చేరలేదు.
రెగ్యులర్ కెప్టెన్ రాబిన్ వాన్ పెర్సీపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ పడటంతో అతని స్థానంలో మరో స్టార్ ప్లేయర్ అర్జెన్ రాబెన్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఫార్వర్డ్ శ్రేణిలో అవకాశం వచ్చినపుడల్లా రాబెన్ బంతితో చిలీ రక్షణశ్రేణిలోకి దూసుకెళ్లాడు. ఆట 40వ నిమిషంలో అతను సంధించిన షాట్ గోల్‌పోస్ట్ పక్క నుంచి బయటకు వెళ్లిపోయింది.
రెండో అర్ధభాగంలో నెదర్లాండ్స్ దూకుడు పెంచింది. సమన్వయంతో కదిలి చిలీ రక్షణపంక్తికి ఇబ్బందులు సృష్టించింది. అయితే నెదర్లాండ్స్ దాడులను చిలీ సమర్థంగా నిలువరించింది. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనిపించింది.అయితే 75వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెరాయ్ ఫెర్, 69వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా అడుగుపెట్టిన డెపె మెంఫిస్ చిలీ ఆశలపై నీళ్లు చల్లారు.
77వ నిమిషంలో లభించిన కార్నర్ కిక్‌ను అర్జెన్ రాబెన్ సహచరుడు డారిల్ జన్మాత్‌కు పాస్ ఇచ్చాడు. అతను కొంచెం ముందుకెళ్లి షాట్ కొట్టగా గోల్‌పోస్ట్ ముందున్న లెరాయ్ ఫెర్ ‘హెడర్’తో బంతిని లక్ష్యానికి చేర్చడంతో నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది.మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా నెదర్లాండ్స్ రెండో గోల్ చేసింది. ఎడమవైపు నుంచి పాదరసంలా కదులుతూ అర్జెన్ రాబెన్ కొట్టిన క్రాస్ షాట్‌ను సబ్‌స్టిట్యూట్ డెపె మెంఫిస్ గోల్‌గా మలిచాడు.