
టీమిండియా ఆటగాళ్లు
ముంబై : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు టీమిండియా కెప్టెన్ ఎవరా అన్న విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీ క్రికెట్ ఆడటం ఖాయం కావడంతో ఈ చారిత్రాత్మక టెస్టుకు దూరం కానున్నాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటనకు ముందు మన ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చేందుకు భారత్ ‘ఎ’ జట్టుకు రెగ్యులర్ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. రహానే, మురళీ విజయ్, రోహిత్, హార్దిక్ పాండ్యాలను ‘ఎ’ జట్టుతో పాటు అక్కడికి పంపితే స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది.
ఈ తరుణంలో అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కెప్టెన్ ఎవరిని ఎంపిక చేయాలని సెలక్టర్లు తీవ్ర తర్జన భర్జన గురవుతున్నారు. సీనియర్ ఆటగాళ్లు దూరం కానుండటంతో ఆల్‌రౌండర్ హర్దీక్ పాండ్యా, వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ క్రికెట్‌లో గుజరాత్ సారథిగా వ్యవహరించిన పార్దీవ్ పటేల్‌కు మినహా మిగతా ఆటగాళ్లు కెప్టన్సీ అనుభవం లేదు. దీంతో పార్దీవ్‌కు సారథ్య బాధ్యతలు అందించే యోచనలో బీసీసీ ఉన్నట్లు సమాచారం. సీనియర్ ఆటగాళ్లను భారత్-ఏ జట్టుకు ఎంపిక చేస్తుండటంతో.. ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా ప్రారంభం కానున్న చారిత్రాత్మక టెస్టుతో పాటు ఐర్లాండ్‌తో రెండు వన్డేల సిరీస్‌కు ఈ నెల 8న భారత జట్టును ప్రకటించనున్నారు.