సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ సూచించిన సిఫార్సుల అమలుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆమోద ముద్ర వేసింది. ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐతో పాటు ఇతర రాష్ట్రాల క్రికెట్ సంఘాలలో సంస్కరణల నిమిత్తం సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బీసీసీఐను ప్రక్షాళన చేస్తూ పలు సంస్కరణలను సూచించింది. ఆరంభం నుంచి లోధా కమిటీ సిఫార్సుల అమలుకు సుముఖంగానే ఉంది. అయితే ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వాటికి ఆమోద ముద్ర వేసింది.
మీరెలా ఎన్నికయ్యారు?
లోధా సిఫార్సుల అమలు కోసం సమావేశమైన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో రభస జరిగింది. ఇటీవలే జి. వివేక్ అధ్యక్షతన ఎన్నికైన హెచ్‌సీఏ నూతన కార్యవర్గం ఎంపికను ప్రశ్నిస్తూ పలువురూ చర్చను లేవనెత్తారు. లోధా సిఫార్సుల ప్రకారం తమ ఎన్నిక జరిగిందని చెప్పుకుంటున్న నూతన హెచ్‌సీఏ పెద్దలు... ఇన్నాళ్ల తర్వాత లోధా సిఫార్సులకు ఆమోద ముద్ర వేయడం ఏమిటని వ్యతిరేక వర్గం ప్రశ్నించింది. అంటే లెక్క ప్రకారం నూతన కార్యవర్గం ఎంపిక చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలకు హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు సంతృప్తికర వివరణ ఇవ్వలేకపోయారు.