ఇదా ప్రతిఫలం
► కోచ్‌గా ఎంపిక కాకపోవడంపై రవిశాస్త్రి నిరాశ
► బీసీసీఐపై పరోక్షంగా విమర్శలు
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు డెరైక్టర్‌గా 18 నెలల పాటు పని చేసిన రవిశాస్త్రి జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికవుతానని భావించారు. అనిల్ కుంబ్లే దరఖాస్తు చేసేవరకూ రేసులో ఆయనే ముందున్నారు. కానీ కుంబ్లే రాకతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కోచ్‌గా ‘జంబో’ను ఎంపిక చేయడంతో రవిశాస్త్రి తీవ్రంగా నిరాశ చెందారు. ‘నేను డెరైక్టర్ గా బాధ్యతలు తీసుకునే సమయానికి ఆటగాళ్లలో స్థైర్యం చాలా తక్కువగా ఉంది. ఒక్కో ఆటగాడితో మాట్లాడుతూ, తిరిగి అందరినీ గాడిలో పెట్టాను. వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్‌లో మేం చాంపియన్ల చేతిలో సెమీస్‌లో ఓడిపోయాం. ఆసియాకప్ టి20 గెలిచాం. విదేశాల్లో విజయాలు సాధించాం.
ఒకవేళ ఇది వైఫల్యం అని ఎవరైనా అనుకుంటే నేనేం చేయలేను’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. డెరైక్టర్‌గా తను ఉన్న సమయంలో భారత జట్టు అనేక చిరస్మరణీయ విజయాలు అందుకుందని గుర్తు చేశారు. కోచ్‌గా తనని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. ‘ఈ నిర్ణయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కాకపోతే తీవ్రంగా నిరాశ చెందాను. ఒక మొక్కను నాటి దానిని పెంచి, పోషించి చివరకు పండ్లను ఇచ్చే సమయంలో పెరుగుతున్న ఆ చెట్టును కొట్టేసినట్లుగా నా పరిస్థితి తయారైంది. జీవితం అంటే ఇంతే’ అని నిరాశగా వ్యాఖ్యానించారు. భారత క్రికెట్‌లో ఏ నిర్ణయానికీ ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. ‘నేను బాధ్యతలు తీసుకునే సమయంలో బీసీసీఐపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఉన్నాయి.
మీడియా, కోర్టులు, అభిమానులు అందరూ రెండువైపులా బోర్డును విమర్శిస్తున్నారు. కానీ భారత క్రికెట్ జట్టు ప్రదర్శన మాత్రం బాగుంది. ఇదొక్కటే ఈ మధ్యకాలంలో జరిగిన మంచి. అయినా నన్ను కోచ్‌గా ఎంపిక చేయలేదు. భారత క్రికెట్‌లో ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’ అని రవిశాస్త్రి ఘాటుగా స్పందించారు.
కుంబ్లేకు సహకారం
కొత్త కోచ్ కుంబ్లేకు రవిశాస్త్రి అభినందనలు తెలిపారు. ‘కోచ్ నిర్ణయం రాగానే కుంబ్లే నాకు ఫోన్ చేశాడు. అద్భుతమైన కుర్రాళ్లతో నిండిన జట్టు అందుబాటులో ఉందని కుంబ్లేకు చెప్పాను. కచ్చితంగా కుంబ్లే రాణిస్తాడు. ఎప్పుడైనా దేనిగురించైనా మాట్లాడేందుకు ఫోన్ చేయొచ్చా అని కుంబ్లే అడిగాడు. ఏ సమయంలో అయినా నా సహకారం ఉంటుందని చెప్పాను’ అని రవిశాస్త్రి తెలిపారు.