
ఈ సెంచరీ.. వెరీ స్పెషల్
తన తొలి అంతర్జాతీయ వన్డేలో సెంచరీ చేయడం గొప్ప అనుభూతి కలిగించిందని, ఈ సెంచరీ తనకు చాలా ప్రత్యేకమని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు.
హరారే: తన తొలి అంతర్జాతీయ వన్డేలో సెంచరీ చేయడం గొప్ప అనుభూతి కలిగించిందని, ఈ సెంచరీ తనకు చాలా ప్రత్యేకమని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. జింబాబ్వేతో తొలి వన్డేలో తమ ఎదుట ఉన్న లక్ష్యం చిన్నదని, దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడానని తన తొలి సెంచరీ గురించి రాహుల్ చెప్పాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో శతకం బాది, తొలి అంతర్జాతీయ వన్డేలో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్మన్గా రాహుల్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
జింబాబ్వే పర్యటనలో తమను నిరూపించుకోవాల్సింది ఏదీ లేదని, దేశవాళీ క్రికెట్కు అంతర్జాతీయ క్రికెట్కు మధ్య గల తేడాను నేర్చుకోవాల్సి ఉందని రాహుల్ అన్నాడు. ఈ పర్యటన వల్ల టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలసి ఆడటంతో పాటు అతని సలహాలు తీసుకునే అవకాశం వచ్చిందని చెప్పాడు. జట్టులోని యువ ఆటగాళ్లందరూ ఐపీఎల్లో రాణించారని, జింబాబ్వేలో దూకుడుగా ఆడుతామని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో రాణించడం తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని రాహుల్ చెప్పాడు.