రాజ్‌కోట్: టెస్టు క్రికెట్‌లో భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు, ప్రస్తుత టీమిండియా సభ్యుడు చతేశ్వర్ పుజారాకు దగ్గరి పోలికలు కనిపిస్తాయి. మూడో స్థానంలో ఆడటం నుంచి బ్యాటింగ్ శైలి వరకు చాలా సందర్భాల్లో ఇద్దరి ఆట ఒకే తరహాలో ఉంటుంది. ఈ విషయాన్ని పుజారా కూడా అంగీకరిస్తాడు. నిజానికి ఆటతో పాటు వ్యక్తిగతంగా కూడా తనపై ద్రవిడ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని పుజారా చెప్పాడు. చిన్నప్పటి నుంచి ద్రవిడ్ ఆటను చూస్తూ పెరిగానని... తనంతట తానుగా అనుకరించకపోయినా ఆ శైలి వచ్చేసిందని అతను అన్నాడు. ‘చిన్నప్పటి నుంచి ద్రవిడ్ ఆటను నేను చాలా బాగా పరిశీలించేవాడిని. పట్టుదలగా క్రీజులో నిలవడం, సులువుగా వికెట్ ఇవ్వకపోవడం నా మనసులో ముద్రించుకుపోయాయి. ఆయనను ఇంతగా అభిమానించినా అనుకరించాలని మాత్రం అనుకోలేదు. ఇద్దరి శైలి ఒకేలా ఉండటం యాదృచ్ఛికమే.
దేశవాళీలో బలహీనమైన సౌరాష్ట్ర తరఫున ఆడటంతో జట్టు కోసం సుదీర్ఘంగా క్రీజ్‌లో పాతుకుపోవాల్సి వచ్చేది. అది అలా అలవాటైంది. భారత జట్టు తరఫున ఆయనతో కలిసి ఆడినప్పుడు మాత్రం పలు సూచనలిచ్చారు. టెక్నిక్‌పై దృష్టి పెడితే సరిపోదని ఇంకా ఇతర అంశాలపై కూడా పట్టు సాధించాలని ద్రవిడ్ నాకు సూచించారు’ అని పుజారా వెల్లడించాడు. క్రికెట్ బయట కూడా జీవితం ఉంటుందని, అప్పుడు ఎలా ఉండాలో ద్రవిడ్ నేర్పించాడని పుజారా గుర్తు చేసుకున్నాడు. ‘క్రికెట్ మాత్రమే కాకుండా జీవితం ప్రాధాన్యత ఏమిటో నేను అర్థం చేసుకునేలా ఆయన చేశారు. ఆట ముగిశాక ఎలా ఉండాలో నేర్పించారు. ప్రొఫెషనల్ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ఎలా భిన్నంగా చూడాలో కౌంటీ క్రికెట్‌లో నాకు తెలిసింది. ద్రవిడ్ ఇచ్చిన సలహాలు అమూల్యమైనవి. నాపై ఆయన ప్రభావం ఏమిటో ఒక్క మాటలో చెప్పలేను’ అని పుజారా తన అభిమానాన్ని ప్రదర్శించాడు. 32 ఏళ్ల పుజారా 10 ఏళ్ల కెరీర్‌లో 77 టెస్టుల్లో 48.66 సగటుతో 5,840 పరుగులు సాధించాడు. 5 వన్డేల్లో కూడా అతను భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment