అమ్మో.. అతడికి బౌలింగా?
టీమిండియా స్టార్ బాట్స్ మన్ విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయడానికి భయపడతానని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. బ్యాటింగ్ లో అతడి సామర్థ్యం, టెక్నిక్ అసమాన్యమని కొనియాడాడు. తనపై తనకున్న విశ్వాసంతో మైదానంలో కోహ్లి అద్భుతాలు చేస్తున్నాడని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు.
'నమ్మకం, సామర్థ్యం, టెక్నిక్ కారణంగా అతడు బ్యాటింగ్ లో అందరికంటే ముందు ఉంటున్నాడు. కోహ్లి.. రివర్స్ షాట్, ల్యాప్ షాట్లు ఆడడం మనం ఎప్పుడూ చూడలేదు. కొలిచినట్టుగా పక్కాగా క్రికెటింగ్ షాట్లే ఆడతాడు. చాలా స్థిరత్వంగా బ్యాటింగ్ చేస్తాడు. అతడికి బౌలింగ్ చేయాల్సి వస్తే ఆందోళన చెందుతా. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ ఓపెనర్ గా వస్తే అవుట్ చేయడానికి చాలా కష్టపడే వాళ్లం. కోహ్లి కూడా అంతే. తొందరగా వికెట్ ఇవ్వడానికి అతడు ఇష్టపడడు' అని అక్రమ్ అన్నాడు.
కోహ్లి సిక్సర్లు సులువుగా కొట్టేస్తున్నాడని తెలిపాడు. 'ఈ ఐపీఎల్ కోహ్లి ఇప్పటివరకు 36 సిక్సర్లు బాదాడు. నా క్రికెట్ కెరీర్ లో 50 ప్లస్ సిక్సర్లు సాధించాను. అతడు ఎంత శక్తివంతుడో దీన్ని బట్టే అర్థమవుతోంది. అతడి ఆటను చూడడం కన్నుల పండుగే' అని అక్రమ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్ కు ఉందని ప్రశంసించాడు. అయితే కోహ్లి, ఏబీని పోల్చడం కష్టమని అన్నాడు.