ఇది విరాట్ సీజన్
హర్షా భోగ్లే
ఐపీఎల్ -9 సీజన్ ముగింపు దశకు చేరింది. అయితే ఇప్పటికే ఈ సీజన్‌పై విరాట్ కోహ్లి తనదైన ముద్ర వేశాడు. మున్ముందు తొమ్మిదో సీజన్ అంటే అది కోహ్లీదేనని అంతా గుర్తుంచుకుంటారు. గతంలో క్రిస్ గేల్, మైక్ హస్సీ అత్యధికంగా ఓ సీజన్‌లో 733 పరుగులతో అగ్రస్థానంలో నిలిచారు. దీన్ని ఎవరైనా అధిగమిస్తారా? అని భావించినా కోహ్లి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఏకంగా తను వెయ్యి పరుగులకు దరిదాపులో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ సీజన్‌లో అతడి ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పరుగులు మాత్రమే కాకుండా నిష్ర్కమణ స్థితి నుంచి జట్టును ఫైనల్‌దాకా తీసుకొచ్చిన ఘనత కూడా తనదే. అలాగే ఆ జట్టును మనమంతా అభిమానించేలా చేశాడు. మరోవైపు ఇదే తరహాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తుది పోరుకు చేర్చించింది ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్. స్టార్లతో ఉన్న జట్టు ఓ వైపు.. మ్యాచ్ విన్నర్‌తో ఉన్న జట్టు మరోవైపు నేటి ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
నపోలి తరఫున మారడోనా అద్వితీయ ప్రదర్శనతో జట్టుకు లా లిగా టైటిల్‌ను అందించినట్టు చిన్నతనంలో విన్నాం. ఇప్పుడు సన్ కప్ గెలిస్తే వార్నర్ గురించి కూడా అలాగే చెప్పుకోవాలి. బెంగళూరు బౌలర్లలో వాట్సన్, చాహల్ వికెట్ల వేటలో దూసుకెళుతున్నారు. క్రిస్ జోర్డాన్, శ్రీనాథ్ అరవింద్ కూడా కీలకంగా ఉన్నారు. అయితే నెహ్రా, ముస్తఫిజుర్ గాయాల కారణంగా హైదరాబాద్ ఆందోళనగా ఉంది. అయితే వారి స్థానాలను భర్తీ చేసిన బెన్ కట్టింగ్, బౌల్ట్ ఫర్వాలేదనిపిస్తున్నారు.
ఆర్‌సీబీకి కెప్టెన్ కోహ్లి ఒక్కడే కాకుండా గేల్, డి విలియర్స్, వాట్సన్, రాహుల్ రూపంలో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అందుకే ఈ జట్టును ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ధావన్, యువరాజ్, హెన్రిక్స్‌లతో పోల్చుకుంటే వారే మెరుగ్గా ఉన్నారు. వీరందరి విన్యాసాలను వీక్షించాలంటే ఐపీఎల్-9 ఫైనల్ పోరును అంతా ఆసక్తికరంగా చూడాల్సిందే. అద్భుత టోర్నమెంట్‌కు చక్కటి ముగింపు లభించాలని ఆశిద్దాం.