సిడ్నీ: మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతున్న టీమిండియా క్రికెట్ జట్టు ఇప్పుడే బ్యాటింగ్ లోపాలు సరిదిద్దుకునే పనిలో పడాలని, ఒకవేళ కాని పక్షంలో విరాట్ సేనకు ఘోర పరాభవం తప్పదని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ హెచ్చరించాడు. ఇంగ్లండ్ పర్యటన ఆధారంగా టీమిండియా బ్యాటింగ్ శైలిని విశ్లేషించిన చాపెల్.. అదే సమయంలో తమ బౌలింగ్ విభాగం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందే టీమిండియా తమ బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలన్నాడు. లేదంటే సొంతగడ్డపై చురకత్తుల్లాంటి బంతులు విసిరే ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టమేనని పేర్కొన్నాడు. ఆసీస్‌తో సిరీస్‌ను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు.
'ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకముందే టీమిండియా బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాలి. స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆసీస్ బ్యాటింగ్ ప్రశ్నార్ధకంగానే కనిపించినా బౌలింగ్ మాత్రం ధీటుగా ఉంటుంది. మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్‌లు సిరీస్ ఆసాంతం ఫిట్‌నెస్‌తో ఉంటే విరాట్ సేనను చిరాకు తెప్పిస్తారు’ అని ఇయాన్ చాపెల్ విశ్లేషించాడు. ఇంగ్లండ్‌లో బంతి గమనం గాలిలో ఉంటే ఆసీస్‌లో అదనపు బౌన్స్ సైతం తోడవుతుందని, దాంతో తమ బౌలింగ్ యూనిట్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నాడు. నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆసీస్ గడ్డపై భారత్ 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment