దుబాయ్: పోలీసుల అకృత్యానికి బలైన నల్లజాతి అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ ఉదంతంతో ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్ష అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ గొప్పతనాన్ని చాటిచెప్పేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంది. వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులోని వైవిధ్యాన్ని ఈ వీడియో ప్రస్ఫుటం చేస్తోంది. వేర్వేరు జాతులకు చెందిన ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్ జట్టు సమష్టిగా ఆడి గతేడాది న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచకప్ కలను ఎలా సాకారం చేసుకుందో ఈ వీడియో చూపిస్తోంది. బార్బడోస్ మూలాలున్న జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన సూపర్ ఓవర్‌తో ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచకప్ అందించిన క్షణాలు ఈ వీడియోలో నిక్షిప్తమయ్యాయి. దీనికి ‘భిన్నత్వం లేకుంటే క్రికెట్టే లేదు’ అనే వ్యాఖ్యను ఐసీసీ జోడించింది. వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్‌లో, టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన బెన్ స్టోక్స్ న్యూజిలాండ్‌లో... స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లకు పాకిస్తాన్‌లో, ఓపెనర్ జేసన్ రాయ్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. వివక్షకు గురవుతోన్న నల్లజాతి క్రికెటర్లకు మద్దతుగా ఉండాలని వెస్టిండీస్ క్రికెటర్లు గేల్, స్యామీ ఇటీవలే ఐసీసీని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment