మేమిద్దరం మరి కాసేపు ఉంటే.. రిజల్టే వేరు: కోహ్లీ
గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం చాలా కష్టం. అందులోనూ దాదాపు చేతివరకు వచ్చిందనుకున్న విజయం చేజారిపోతే ఇంకా కష్టం. సరిగ్గా ఇలాంటి కష్టమే టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి వచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో తాను, ఏబీ డివీలియర్స్ వెంటవెంటనే ఔటయిపోవడమే తమకు పెద్ద శరాఘాతంలా పరిణమించిందని కోహ్లీ విశ్లేషించాడు. సీజన్ మొత్తం తాము చాలా బాగా ఆడినందుకు గర్వంగానే ఉందని, బెంగళూరు అభిమానులు తాము అసలు సరిగా ఆడనప్పుడు కూడా మద్దతు ఇచ్చారని అన్నాడు.
మరి కొంతసేపు తాను, డివీలియర్స్ కలిసి ఆడి ఉంటే.. ఫలితం వేరేగా ఉండేదని మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజంటేషన్ కార్యక్రమంలో అన్నాడు. 54 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ అవుట్ కాగా, డివీలియర్స్ కేవలం 5 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి బిపుల్ శర్మ బౌలింగ్‌లో వెనుదిరగడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన సంగతి తెలిసిందే. 973 పరుగులు సాధించి ఆరంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోవడం బాగానే ఉంది గానీ, విజయానికి అవతలివైపు ఉండి దీన్ని సాధించడం అంత బాగా అనిపించడంలేదని చెప్పాడు. సన్‌రైజర్స్ బౌలింగ్ ఎటాక్ చాలా బలంగా ఉందని, అందుకే వాళ్లు గెలిచారని అన్నాడు.