లెక్క సరిచేయాలి!
నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో టి20
ఒత్తిడిలో ధోనిసేన
సిరీస్‌పై కన్నేసిన సఫారీలు
కటక్: ఓవైపు భారీ స్కోరు చేసినా ఓడిపోయామన్న బాధలో భారత్... మరోవైపు సిరీస్‌పై కన్నేసిన దక్షిణాఫ్రికా... ఈ నేపథ్యంలో నేడు (సోమవారం) బారాబతి స్టేడియంలో జరగనున్న రెండో టి20 మ్యాచ్‌లో ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్ రెండు లక్ష్యాలతో బరిలోకి దిగుతోంది. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా ఇందులో గెలవాలి. అలాగే సఫారీలను ఒత్తిడిలో పడేయాలంటే ఇందులో నెగ్గి లెక్క సరిచేయాలి. ఇందుకోసం టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రోహిత్ శర్మ సెంచరీ, విరాట్ కోహ్లి నిలకడతో తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధ్యమైంది. కాబట్టి బ్యాట్స్‌మెన్ నుంచి అంతకంటే ఎక్కువగా ఆశించలేం.
అయితే ధావన్, రైనా, ధోనిలు ఇంకా గాడిలో పడలేదు. ప్రత్యర్థి పటిష్టంగా ఉంది కాబట్టి ఈ ముగ్గురు కూడా సమయానుకూలంగా చెలరేగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోయర్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ బ్యాట్ ఝుళిపిస్తే విజయానికి అవసరమైన పరుగులు జత చేయొచ్చు. ఇక బౌలింగ్‌లో ఒక్క అశ్విన్ మినహా మిగతా వారు ఘోరంగా ఆడటం భారత్‌ను ఆందోళనలో పడేసింది. లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు యార్కర్లు వేయడంలో పేసర్లు విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఓవర్లే ఓటమికి కారణమన్నది సుస్పష్టం. అశ్విన్‌కు కనీసం ఒక్కర్నించైనా సహకారం అందితే ఈ మ్యాచ్‌లో గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే రాయుడు, అక్షర్ స్థానంలో రహానే, అమిత్ మిశ్రాను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. కానీ ధోని తుది జట్టులో మార్పులు చేస్తాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు ఓడిపోతామనే మ్యాచ్‌లో గెలవడంతో సఫారీల ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని సఫారీలు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌కూ తుది జట్టులో మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతున్నారు. దీంతో ఆమ్లా, డివిలియర్స్, డుమినిపైనే మరోసారి భారీ ఆశలు పెట్టుకున్నారు. డు ప్లెసిస్, బెహర్దీన్ చెలరేగితే లోయర్ ఆర్డర్‌లో డేవిడ్ మిల్లర్ బెస్ట్ ఫినిషింగ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. తొలి టి20లో కాస్త విఫలమైన పేసర్లు ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉన్నారు. స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మ్యాజిక్ పని చేస్తే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు కష్టాలు తప్పవు.
జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అంబటి రాయుడు/ అజింక్య రహానే, అక్షర్ పటేల్/ అమిత్ మిశ్రా, అశ్విన్, భువనేశ్వర్, మొహిత్ శర్మ, శ్రీనాథ్ అరవింద్.
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), హాషిమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, బెహర్దీన్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, రబడా, అబాట్, డిలాంగ్, ఇమ్రాన్ తాహిర్.
వాతావరణం: రాబోయే 48 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక. మ్యాచ్ మొత్తానికి రద్దయ్యే అవకాశాల్లేకపోయినా ఓవర్లు కుదించొచ్చు.
పిచ్: తేమ వల్ల పిచ్ నెమ్మదిగా తక్కువ బౌన్స్‌ను కలిగి ఉండనుంది.
రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం