చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుట్టావ్! | Image for the news result Rio Olympics: Caster Semenya Wins and Claressa Shields Defends Title | Sakshi
Sakshi News home page

చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుట్టావ్!

Published Mon, Aug 22 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుట్టావ్!

చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుట్టావ్!

ఓటమిని రుచి చూసిన వాళ్లకే గెలుపు విలువ తెలుస్తుంది... అవమానాన్ని ఎదుర్కొన్నవాళ్లకే గౌరవం గొప్పతనం అర్థమవుతుంది.. వివక్షను అనుభవించిన వారికే దాని వెనకున్న బాధ బోధపడుతుంది.. నల్లజాతి సూరీడు పుట్టిన గడ్డ నుంచి అందుకున్న స్ఫూర్తితో... జాతికి వెలుగులు నింపుతూ... ప్రపంచానికి క్రీడోపదేశం చేస్తూ.. చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుట్టిన సెమెన్యా విజయగాథ ఇది.

దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా సమీపంలో ఓ కుగ్రామంలో పుట్టిన సెమెన్యా కాస్టర్‌కు చిన్నప్పటినుంచి సాకర్ అంటే అభిమానం. ఎలాగైనా ఈ క్రీడలో రాణించాలనే సంకల్పంతో పరుగును ప్రారంభించింది. అయితే ఈ పరుగు కాస్త ఆమెను ట్రాక్ ఎక్కించి ప్రపంచానికి కొత్త అథ్లెట్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో చిన్నచిన్న ఈవెంట్లలో పాల్గొన్న సెమెన్యా.. జాతీయ రికార్డులతో శభాష్ అనిపించుకుంది. 2008లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ యూత్‌గేమ్స్‌లో 800 మీటర్ల ఈవెంట్‌లో 2.04.23 టైమింగ్‌తో స్వర్ణం గెలుచుకుంది. 2009లో జరిగిన ఆఫ్రికన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్లు, 1500 మీటర్లలో రికార్డు టైమింగ్స్‌తో స్వర్ణాలు సాధించింది.
 
గెలుపుపై అనుమానాలు
2009లో బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ 800 మీటర్ల ఫైనల్ రేసుకు అంతా సిద్ధమైంది. అప్పటికే జోరుమీదున్న సెమెన్యా మీదే అందరి దృష్టి. రేసు ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు... సెమెన్యా నిషేధిత డ్రగ్స్ వాడి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేసిన ఐఏఏఎఫ్ (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్) ఈ అథ్లెట్‌పై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన అథ్లెట్లు ఆశ్చర్యపోయినా... దీన్ని ఏమాత్రం పట్టించుకోని సెమెన్యా మరింత మెరుగైన టైమింగ్‌తో (1.55.45) బంగారుపతకాన్ని అందుకుంది. దీంతో ఐఏఏఎఫ్ మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసి... డ్రగ్స్ కాదు, సెమెన్యాకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.
 
సెమెన్యా.. హమ్ హైనా
సెమెన్యాపై ఐఏఏఎఫ్ ఆరోపణలను తోటి క్రీడాకారులు తీవ్రంగా ఖండించారు. స్ప్రింటర్ దిగ్గజం మైకెల్ జాన్సన్ కూడా క్రీడాసంఘం తీరుపై బహిరంగంగానే మండిపడ్డారు. నల్లజాతీయురాలైనందుకే సెమెన్యా హక్కులు, వ్యక్తిగత జీవితాన్ని అవమానిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మీడియా కూడా ఆమెకు అండగా నిలిచింది.

గొప్ప అథ్లెట్‌ను అవమానపరుస్తున్నారంటూ పతాకశీర్షికలో వార్తలు రాసింది. అయితే సెమెన్యా మోసం చేసిందని భావించటం లేదని.. ‘అరుదైన ఆరోగ్య స్థితి’ (రేర్ మెడికల్ కండీషన్) ఉండొచ్చనే అనుమానంతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు 2009లోనే క్రీడాసంఘం స్పష్టం చేసింది. పరీక్షల ఫలితాలు వచ్చేంతవరకు సెమెన్యా ఏ ఈవెంట్లో పాల్గొనరాదని ఆదేశించింది.
 
ఏడాది నిరీక్షణ తర్వాత
2010లో సెమెన్యా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఐఏఏఎఫ్ పచ్చజెండా ఊపింది. 2010, 2011లో పలు ఈవెంట్లలోనూ ఈ నల్లజాతీయురాలు సత్తాచాటింది. ఈమెపై ఉన్న వివాదాలన్నీ పక్కనపెట్టి.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తమదేశ పతాకధారిగా సెమెన్యాను దక్షిణాఫ్రికా ఎంచుకుంది. ఈ ఒలింపిక్స్‌లో ఆమె 800 మీటర్లలో రజతం సాధించింది. ఆ తర్వాత పలు ఈవెంట్లలోనూ పతకాలు గెలిచింది. 2016 ఒలింపిక్స్‌లో 800 మీటర్ల రేసులో స్వర్ణంతో తనలో సత్తా తగ్గలేదని నిరూపించింది.

‘మనం ఎలా ఉంటామనేది కాదు. మనమెలా పరిగెడతామనేదే ముఖ్యం’ అని చెప్పింది. బాల్యం నుంచి కసి, పట్టుదలతో రాణించిన సెమెన్యాకు జీవితంలో ఎత్తుపల్లాలు తెలుసు. అందుకే అవమానాలను, ఛీత్కారాలను మౌనంగా భరించింది.తనపై ఆరోపణలు అసత్యమని తేలాక.. మళ్లీ ట్రాక్ ఎక్కి రికార్డుల మోత మోగిస్తోంది.
 
సంబరాలకు దూరమే
చిన్న ఈవెంట్లు గెలిస్తేనే.. ప్రపంచాన్ని గెలిచినట్లు సంబరపడతాం. కానీ సెమెన్యా మాత్రం జీవితంలో బాధను, సంతోషాన్ని ఒకేలా చూస్తుంది. ‘ఏడేళ్లుగా చాలా బాధపడ్డా. మళ్లీ ఈ స్థితికి చేరుకుంటానని అనుకోలేదు. నేనూ ప్రపంచ చాంపియన్‌నే. కానీ ఎప్పుడు గెలిచినా సంబరాలు చేసుకోలేదు. సంబరాలు నా దృష్టిలో ఓ జోక్. నేను చిన్నప్పటినుంచే అబ్బాయిల మధ్య పెరిగాను. దీన్నిప్పుడు మార్చుకోలేం’ అని సెమెన్యా తెలిపింది. ఆరోపణలతో అంతర్జాతీయ కెరీర్‌కు దూరంగా ఉన్న విరామంలో.. ప్రిటోరియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ సైన్స్ కోర్సులో చేరింది. 2015లో తన దీర్ఘకాల మిత్రురాలు వాయిలెట్ లెడ్లీ రసేబోయాను 2015 చివర్లో సెమెన్యా పెళ్లి చేసుకుంది.
 
సెమెన్యా రేసుకు సెక్యూరిటీ
మొన్నటివరకు సెమెన్యాను అవమానించిన క్రీడా సంఘమే.. రియోలో జరిగిన 800 మీటర్ల ఫైనల్‌కు పటిష్టమైన భద్రత ఏర్పాటుచేసింది. ఈ భద్రత సెమెన్యా కోసమే. ఆమె తోటి రన్నర్ల అభిమానులు.. సెమెన్యాపై దాడిచేసే అవకాశం ఉందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతోనే అప్రమత్తమయ్యారు.
 
శభాష్... సెమెన్యా
మహిళల 800 మీటర్ల విభాగంలో స్వర్ణం సొంతం

రియో డి జనీరో: వివాదాస్పద దక్షిణాఫ్రికా అథ్లెట్ కాస్టర్ సెమెన్యా అంచనాలకు అనుగుణంగా రాణించి రియో ఒలింపిక్స్‌లో మెరిసింది. మహిళల 800 మీటర్ల విభాగంలో సెమెన్యా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో 25 ఏళ్ల సెమెన్యా ఒక నిమిషం 55.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాంకైన్ నియోన్‌సబా (బురుండి-1ని:56.49 సెకన్లు) రజతం, మార్గరెట్ వాంబుయ్ (కెన్యా-1ని:56.89 సెకన్లు) కాంస్యం సాధించారు.

2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సెమెన్యా ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేసి ఈ విభాగంలో పసిడి పతకం నెగ్గిన తొలి దక్షిణాఫ్రికా అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్ రేసులో సెమెన్యాకు తన ప్రత్యర్థుల నుంచి ఎలాంటి పోటీ ఎదురుకాలేదు. తొలి ల్యాప్‌ను 57.59 సెకన్లలో ముగించి అగ్రస్థానంలోకి వెళ్లిన సెమెన్యా ఆ తర్వాత ఇదే దూకుడు కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
 
ద్యుతి దెబ్బకు నిబంధనల మార్పు
2015లో భారత అథ్లెట్ ద్యుతిచంద్‌పై కూడా సెమెన్యాకు ఆపాదించిన ఆరోపణలు తలెత్తాయి. దీనిపై మరోసారి లింగ నిర్ధారణపైనా.. కొందరు మహిళల్లో టెస్టోస్టెరాన్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల వారి సామర్థ్యం పెరుగుతుందన్న ఐఏఏఎఫ్ వాదనపైనా తీవ్రమైన చర్చ జరిగింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో ‘ద్యుతి వర్సెస్ భారతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్, ఐఏఏఎఫ్’ కేసులో వాదోపవాదనల తర్వాత టెస్టోస్టెరాన్‌తో సామర్థ్యం పెరుగుతుందనేది అపోహ అని నిరూపితమైంది. దీంతో ఐఏఏఎఫ్ నిబంధనల్లోని ‘హైపర్‌ఆండ్రోజెనిజమ్’ను రద్దుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement