బ్రిస్టల్: పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 36 ఏళ్ల క్రితం భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ నెలకొల్పిన రికార్డును ఇమామ్ ఉల్ బద్ధలు కొట్టాడు. ఇంగ్లండ్‌లో అత్యంత పిన్న వయసులో 150కి పైగా వన్డే పరుగులు సాధించిన రికార్డును ఇమామ్ తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే ఇమామ్ ఉల్ హక్ 151 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించిన క్రీడాకారుడిగా ఇమామ్ గుర్తింపు పొందాడు. అంతకుముందు 1983 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన పోరులో కపిల్ దేవ్ 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటికి అతడి వయసు 24 ఏళ్లు. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు 23 ఏళ్ల ఇమామ్ ఇంగ్లండ్‌లో 150పైగా స్కోరు సాధించాడు.
మూడో వన్డేలో ఇమామ్ 131 బంతుల్లో 16 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో 151 పరుగులు నమోదు చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు. అతడితో పాటు హ్యారిస్ సొహైల్ (41), అసిఫ్ అలీ (52) రాణించడంతో ఇంగ్లాండ్‌కు పాక్ 359 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే పాక్ ఆశలను ఇంగ్లండ్ నీరుగార్చింది. భారీ లక్ష్యాన్ని మరో 31 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయంలో జానీ బెయిర్‌స్టో (128; 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. అతడికి తోడుగా జాసన్ రాయ్ (76; 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ముఖ్య భూమిక పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment