
అబుదాబి:ఇంజమామ్ వుల్ హక్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ల ఒకడైన ఇంజమామ్ తన టెస్టు కెరీర్ లో 25 సెంచరీలు చేయగా, 46 అర్థ శతకాలు సాధించాడు. ఇక వన్డే కెరీర్ లో 10 శతకాలు, 83 హాఫ్ సెంచరీలు అతని సొంతం. ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా సేవలందిస్తున్నాడు ఇంజమామ్.
ఇదిలా ఉంచితే, ఇప్పుడు అతని మేనల్లుడిగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఇమామ్ వుల్ హక్ ఆడిన తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. మేనమామ పేరును నిలబెడుతూ అరంగేట్రం మ్యాచ్ లోనే శతకంతో మెరిశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో భాగంగా మూడో వన్డే ద్వారా తన అంతర్జాతీయ కెరీర్ కు శ్రీకారం చుట్టిన ఇమామ్ వుల్ హక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంజమామ్ కు మేనల్లుడు కావడం వల్లే పాక్ జట్టులో చోటు దక్కిందనే వాదనకు తెరదించుతూ అత్యుత్తమ ఇన్నింగ్స్ ను ఇమామ్ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే అరంగేట్రపు వన్డే మ్యాచ్ లోనే శతకం సాధించిన రెండో పాక్ క్రికెటర్ గా అరుదైన ఘనతను ఇమామ్ వుల్ హక్ సొంతం చేసుకున్నాడు. ఓవరాల్ గా అరంగేట్రపు వన్డేలో శతకం సాధించిన 13వ ఆటగాడిగా ఇమామ్ గుర్తింపు సాధించాడు. ఇమామ్ 125 బంతుల్లో 100 పరుగులు చేసి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా పాకిస్తాన్ వన్డే సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుని టెస్టుల్లో ఎదురైన ఓటమికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment