
భారీ ఆధిక్యంలో భారత్ ‘ఎ’
- ఆసీస్ ‘ఎ’ 268 ఆలౌట్
- ఓజాకు ఐదు వికెట్లు
చెన్నై: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. అభినవ్ ముకుంద్ (40), కెప్టెన్ పుజారా (42) నిలకడగా ఆడటంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 3 వికెట్లకు 121 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (4 బ్యాటింగ్), శ్రేయస్ అయ్యర్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లోకేశ్ రాహుల్ (29) విఫలమయ్యాడు. ముకుంద్, పుజారా రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.
ప్రస్తుతం టీమిండియా ఓవరాల్‌గా 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 185/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. హ్యాండ్స్‌కాంబ్ (91) సెంచరీ చేజార్చుకున్నాడు. స్టోనిస్ (77) మెరుగ్గా ఆడారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 154 పరుగులు జోడించారు. అయితే లోయర్ ఆర్డర్ పూర్తిగా నిరాశపర్చడంతో ఆసీస్ 35 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 5, మిశ్రా 3 వికెట్లు తీశారు.