కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ఆంధ్ర బౌలర్లు ఆలస్యంగా స్పందించడంతో మహారాష్ట్ర భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ (214 బంతుల్లో 173, 22 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఆంధ్ర బౌలర్ విజయ్ కుమార్ (6/83) రాణించినా ఫలితం లేకపోయింది. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా ఇక్కడి వై.ఎస్.రాజారెడ్డి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 127.5 ఓవర్లలో 440 పరుగులు చేసి ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. శనివారం 196/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన మహారాష్ట్రకు రోహిత్ మోత్వాని (123 బంతుల్లో 95 నాటౌట్, 13 ఫోర్లు), అంకిత్ బావ్నే (152 బంతుల్లో 54, 6 ఫోర్లు) మంచి స్కోరు సాధించిపెట్టారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ ఆట ఆరంభమైన కాసేపటికే సెంచరీ పూర్తి చేశాడు. అంకిత్‌తో కలిసి భారీస్కోరుకు బాటలు వేశాడు. నాలుగో వికెట్‌కు ఇద్దరు కలిసి 160 పరుగులు జోడించారు.
ఈ దశలో విజయ్ కుమార్ విజృంభించడంతో కేదార్, బావ్నేలతో పాటు అక్షయ్ దరేకర్ (0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. టెయిలెండర్ల నుంచి సహకారం లేకపోవడంతో మోత్వాని సెంచరీకి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మహారాష్ట్ర 122 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లను కోల్పోయింది. ఆంధ్ర బౌలర్లలో హరీశ్ 2, స్టీఫెన్, సురేశ్ చెరో వికెట్ తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. భరత్ (14), చిరంజీవి (8) క్రీజ్‌లో ఉన్నారు.
మహారాష్ట్రకు ఆధిక్యం
Published Sun, Dec 1 2013 1:44 AM | Last Updated on Mon, Oct 8 2018 5:52 PM
Advertisement
Advertisement