
మరోసారి తడబాటు
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 267/6
చెన్నై: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు బ్యాట్స్‌మెన్ మరోసారి తడబడ్డారు. కంగారూల బౌలింగ్‌ను ఎదుర్కొలేక తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం అసాధ్యం. అభినవ్ ముకుంద్ (163 బంతుల్లో 59; 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (66 బంతుల్లో 49; 8 ఫోర్లు) ఓ మోస్తరుగా ఆడటంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసింది.
అపరాజిత్ (28 బ్యాటింగ్), గోపాల్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 53 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్లలో పుజారా (11) మళ్లీ నిరాశపర్చాడు. వన్‌డౌన్‌లో కోహ్లి (94 బం తుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ నాయర్ (34 బంతుల్లో 31; 7 ఫోర్లు) శుభారంభాలను భారీ స్కోర్లుగా మల్చలేకపోయారు. కీఫీ 3 వికెట్లు తీశా డు. అంతకుముందు 329/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 107.5 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారూలకు 214 పరుగుల ఆధిక్యం లభించింది.